
ప్రజాశక్తి - తెనాలి : చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవం బుధవారం రెండోరోజుకు చేరింది. స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని వివేకానంద సెంట్రల్ స్కూల్‌లో ఏవీఎస్ కళావేదికపై జరుగుతున్న ఉత్సవంలో వరుసగా ది ఛాంపియన్, దడా, మిస్టర్ బోన్స్ చిత్రాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఫిల్మ్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ రావిపాటి వీరనారాయణ మాట్లాడుతూ చలన చిత్రోత్సవాల్లో పాల్గొనేందుకు గురువారం పలువురు సినీ ప్రముఖులు రానున్నట్లు తెలిపారు. బింబిసార చిత్రం ఫేమ్ బేబీ శ్రీదేవి, ఈటీవీ సీరియల్ మనసు మమత ఫేమ్ శ్రీదివ్య, భగవంత్ కేసరి ఫేమ్ మాస్టర్ పుష్కర్, నంది అవార్డు గ్రహీత, పాటల రచయిత, దర్శకుడు డి.శ్రీనివాస్ తదితరులు హాజరవుతారన్నారు. చలన చిత్రాల ప్రదర్శనను సొసైటీ కార్యదర్శి బొల్లిముంత కృష్ణ, లాలితానంద్, మురళి, చిన చౌదరి, కనపర్తి రత్నాకర్, మునిపల్లి శ్రీకాంత్ పర్యవేక్షించారు.