Dec 01,2022 21:54

ప్రజాశక్తి - టి.నరసాపురం
           గిరిజనులు, పేదలు సాగు చేస్తున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు తామా ముత్యాలమ్మ, జిల్లా సహాయ కార్యదర్శి తుమ్మల సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. వ్యకాస 29వ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ చేపట్టిన ఆటో ప్రచార యాత్ర మూడో రోజు గురువారం మండలంలోని అప్పలరాజుగూడెం, అబ్దుల్లాపురం, సాలిగూడెం, మధ్యాహ్నపువారిగూడెం, బచ్చులేటివారిగూడెం, రామమ్మగూడెం, అల్లూరి సీతారామరాజు నగర్‌ మీదుగా చింతలపూడి చేరింది. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ మండలంలో ఎర్రకాలువ మిగులు భూములు పేదలకు హక్కు పత్రాలు ఇవ్వాలని, బచ్చులేటిగూడెం పోడు భూములకు, మంగళమెట్ట సాగుదారులకు సాగు పత్రాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అల్లూరి సీతారామరాజు నగర్‌ గుడిసెవాసులకు కరెంటు, నీళ్లు సౌకర్యం కల్పించి పోడు కొట్టి సాగు చేసుకున్న భూమికి సాగు పత్రాలు మంజూరు చేయాలన్నారు. సూరంపూడి గట్టును 40 సంవత్సరాలుగా సాగు చేస్తున్న దళితులు, గిరిజనులు, పేదలకు పంట పరిహారం చెల్లించాలని, భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 7, 8, 9, 10 తేదీల్లో జంగారెడ్డిగూడెంలో దండమూడి రామలక్ష్మి కళ్యాణమండపంలో జరిగే రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మడకం సుధారాణి, సముద్రాల సాయికృష్ణ, భూపోరాటాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
చాట్రాయి: వ్యవసాయ కార్మిక సంఘం 29వ రాష్ట్ర మహాసభ ప్రచారం జాతా గురువారం చాట్రాయి చేరుకుంది. ప్రధాన సెంటర్లో జరిగిన సభలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శేషపు మహంకాళిరావు మాట్లాడుతూ భూమి, కూలీ, ఉపాధి ప్రధాన సమస్యలుగా మహాసభలో చర్చించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పిల్లి మురళి, నేతలు జక్కుల మహేష్‌, మేడేపల్లి హోలీ మేరీ, సిఐటియు మండల కార్యదర్శి కొలికపోగు భాస్కర్‌, మీసాల కుమార్‌ పాల్గొన్నారు.
చింతలపూడి: వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహసభను జయప్రదం చేయాలని ప్రచార యాత్ర గురువారం పట్టణం మీదుగా సాగింది. బోస్‌బొమ్మ సెంటర్లో మహాసభలకు సంబంధించిన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా నేత తుమ్మల సత్యనారాయణ మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్‌.సూర్యకుమార్‌, సాయికృష్ణ, కుమారి, డి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఆగిరిపల్లి: వ్యవసాయ కార్మిక సంఘం 29వ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం మండల అధ్యక్షులు సత్తు కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం ప్రచారం జాతాను సంఘ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పిల్లి మురళీ ప్రారంభించారు. కార్యక్రమంలో శేషపు మహాంకాళీరావు, జక్కుల మహేశ్‌, మీసాల కుమార్‌, జహాంగీర్‌ భాషా పాల్గొన్నారు.
కుక్కునూరు : ఈ నెల 8,9,10 తేదీల్లో జంగారెడ్డిగూడెంలో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యర్రంశెట్టి నాగేందర్రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గురువారం గోడపత్రికలను ఆవిష్కరించారు. మండలంలో అన్ని ప్రాంతాల్లో వాల్‌పోస్టర్లు అంటించారు. అనంతరం జరిగిన సమావేశంలో నాగేంద్రరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్య.కా.స నాయకులు బయ్యన శ్రీను, మహబూబ్‌ పాషా, బాబు పాల్గొన్నారు.
జీలుగుమిల్లి : వ్య.కా.స రాష్ట్ర మహాసభకు మండలం నుంచి వెయ్యి మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి రాజమండ్రి దానియేలు తెలిపారు. మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ మండలంలో ఆటో ప్రచార యాత్ర చేపట్టారు. అనంతరం మండల జనరల్‌ బాడీ సమావేశం దానియేలు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎ.రవి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. మహాసభకు కష్టజీవులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు తెల్లం దుర్గారావు, నేలటూరి అప్పారావు, సిరిబత్తుల సీతారామయ్య, చిట్టిబొమ్మ కొండలరావు, గుండే గంగరాజు, తెల్లం శంకరుడు పాల్గొన్నారు.