Jul 21,2023 21:49

బలిజిపేట : దీక్షలనుద్దేశించి మాట్లాడుతున్న మన్మధరావు
 కొనసాగిన విఆర్‌ఎల రిలే నిరాహార దీక్షలు
పార్వతీపురంలో విఆర్‌ఎల రిలే నిరాహార దీక్షలు

ప్రజాశక్తి - పార్వతీపురంరూరల్‌ : సమస్యల పరిష్కారం కోరుతూ విఆర్‌ఎలు చేపడుతున్న రిలేనిరాహారదీక్షలు శుక్రవారం కూడా కొనసాగాయి. ఈ దీక్షలకు సిఐటియు నాయకులు సంఘీభావం తెలిపారు. శిబిరాన్ని సందర్శించిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు, కోశాధికారి జి.వెంకటరమణ, ఉపాధ్యక్షులు వి.ఇందిర మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరిస్తారని విఆర్‌ఎలు ఓట్లు వేసినందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మోసగించిందన్నారు. ఎన్నికల ముందు సిఎం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులు నిరాహార దీక్ష చేస్తున్నారని, ప్రభుత్వ స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. విఆర్‌ఎల న్యాయపరమైన కనీసవేతనం రూ.26వేలు చెల్లించాలని, నామిని విఆర్‌ఎలను విఆర్‌ఎలుగా గుర్తించాలని, అర్హులైన విఆర్‌ఎలకు ఉద్యోగోన్నతు కల్పించాలని, డిఎతో కూడిన కూడినవేతనం చెల్లించాలని, 65ఏళ్లు దాడి మరణించిన కుటుంబంలో కాంపాసినెట్‌ కింద ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే ఆగస్టు 7,8 తేదీల్లో కలెక్టరేట్‌ వద్ద జరుగు ధర్నా జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమములో విఆర్‌ఎలు విజరుకృష్ణ, ఆదినారాయణ, నిర్మల, తదితరులు పాల్గొన్నారు.
పాలకొండ రూరల్‌: సమస్యలను పరిష్కరించాలని విఆర్‌ఎలు చేపట్టిన రిలేనిరాహారదీక్షలు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో జరిగాయి. ఈ దీక్షలనుద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు మాట్లాడుతూ రోజురోజుకు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో విఆర్‌ఎల జీతాలు పెంచాలని, ఉద్యోగత భద్రత కల్పించాలని, గతంలో ఇచ్చిన డిఎ తిరిగి వెనక్కి తీసుకునే పద్ధతి విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనియెడల సిఐటియూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తారని హెచ్చరించారు. ఈ దీక్షలకు రెవెన్యూ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు బుచ్చిబాబు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు మండల సమన్వయ కమిటీ కార్యదర్శి కాద రాము, బత్తిని రామయ్య, మడపాన శ్రీనివాసరావు, గుణుపూర్‌ ప్రసన్నకుమార్‌, రేగాన ప్రసాద్‌, మాధవ రావు, డి.పారమ్మ, జయమ్మ, మంగమ్మ, పార్వతి పాల్గొన్నారు.
సీతానగరం : సమస్యల పరిష్కరించాలని కోరుతూ స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద విఆర్‌ఎలు రెండోరోజూ నిరసన దీక్షలు కొనసాగించారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి జి.వెంకటరమణ, సంఘం నాయకులు వడ్డీ సూరి నాగయ్య, సింహాచలంతో పాటు పలు గ్రామాలకు చెందిన గ్రామ రెవెన్యూ సహాయకులు పాల్గొన్నారు.
కురుపాం : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద విఆర్‌ఎ దీక్ష రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా విఆర్‌ఎల సంఘం జిల్లా అధ్యక్షులు జి.ఈశ్వరరావు మాట్లాడుతూ తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 7,8 తేదీల్లో కలెక్టరేట్‌ వద్ద చేపట్టబోయే దీక్షలకు విఆర్‌ఎలు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. అనంతరం తహశీల్దార్‌ ఆర్‌.రమేష్‌కుమార్‌కు సమస్యలపై వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో మండలంలో గల విఆర్‌ఎలు పాల్గొన్నారు.
బలిజిపేట : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద కొనసాగుతున్న విఆర్‌ఎల దీక్షలకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధ రావు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో విఆర్‌ఎలు సుదర్శన రామయ్య బాబురావు జ్యోతి శ్రీను నారాయణ తదితరులు పాల్గొన్నారు.
సాలూరు:తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విఆర్‌ఎల సంఘం ఆధ్వర్యాన రెండో రోజు కూడా విఆర్‌ఎ లు దీక్షలు చేపట్టారు.సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వైనాయుడు దీక్షలకు మద్దతు పలికారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఎస్‌.పాపారావు, మోహన్‌ రావు పాల్గొన్నారు.
పాచిపెంట : విఆర్‌ఎల సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు టి.ప్రభావతి ఆధ్వర్యంలో శుక్రవారం రెవెన్యూ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో విఆర్‌ఎలు పి.అశోక్‌, సావిత్రమ్మ తదితరులు పాల్గొన్నారు.
భామిని : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో విఆర్‌ఎ రిలే నిరాహార దీక్ష జరిగాయి. ఈ దీక్షలనుద్దేశించి విఆర్‌ఎ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మిన్నరావు మాట్లాడారు. అనంతరం తహశీల్దార్‌ ఎన్‌.అప్పారావుకు వితిని అందజేశారు. కార్యక్రమంలో విఆర్‌ఎలు ఎన్‌.మాధవ, మరియమ్మ, లక్ష్మి, జాను పాల్గొన్నారు.