Oct 08,2023 23:25

ప్రజాశక్తి-యంత్రాంగం
మాజీ సిఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఆ పార్టీ శ్రేణులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం కొనసాగాయి. వివరాలు ఇవి..
మండపేట చంద్రబాబుకు మద్దతుగా స్ధానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఎంఎల్‌ఎ వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరహారదీక్షలు ఆదివారం కొనసాగాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వైసిపి పాలనలో ప్రజలంతా అష్టకష్టాలు పడుతున్నారన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేశారన్నారు.టిడిపిని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందన్నారు. ఈ దీక్ష శిబిరంలో టిడిపి నాయకులు పిల్లా తాతాలు, మాజీ ఎంపిటిసి సభ్యుడు రమేష్‌ రాజు, కోట దుర్గారావు, ఇందుకూరి శ్రీనివాసరాజు, గొర్రెల వీర్రాజు తదితరులు కూర్చున్నారు. పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్‌ కార్యదర్శి సల్మాన్‌ హుస్సేన్‌, టిడిపి నాయకులు గుండు వీర తాతరాజు తదితరులు సంఘీభావం తెలిపారు. రామచంద్రపురం మండలం టిడిపి నాయకులు,కార్యకర్తలు చేస్తున్న రిలే నిరహార దీక్షలు 26వ రోజుకుచేరుకున్నాయి. చంద్రబాబుపై కుట్రపూరితంగా అక్రమ కేసులు బనాయించి రిమాండ్‌ విధించిన నేపథ్యంలో ఆ పార్టీ ఇంచార్జ్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ మొదట గుజరాత్‌ లో ఏర్పాటు చేశారని అక్కడ విజయవంతం అయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ లో కూడా నిబంధనలు అనుసరించి స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి దాదాపు రెండు లక్షల పైన విద్యార్థులకు ట్రైనింగ్‌ ఇచ్చారన్నారు. వారిలో దాదాపు 85 వేల మంది విద్యార్థులు మంచి ఉద్యోగాల్లో సెటిల్‌ అయ్యారని వారందరూ ఇప్పుడు రోడ్ల మీదకు వచ్చి బాబు కి తమ సంఘీభావం ప్రకటిస్తున్నారని అన్నారు. ఏనాడూ ఒక పెద్ద సంస్థను ఆంధ్రప్రదేశ్‌ కు తేలేని వైసిపి ప్రభుత్వం కుట్రపూరితంగా బాబు ని అరెస్టు చేశారని ఇక ప్రజలు ఇది సహించే పరిస్థితుల్లో లేరని వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్టేనని అన్నారు.ఈకార్యక్రమంలోరామచంద్రపురం రూరల్‌ మండలపార్టీ నాయకులు, వీరితో పాటు పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్‌ నాయకులు, క్లస్టర్‌ , యూనిట్‌ ఇన్‌ ఛార్జ్‌ , బూత్‌ ఇన్‌ ఛార్జ్‌లు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.