
ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా విలేకర్లు : టిడిపి అధినే అరెస్ట్‌కు నిరసనగా గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఆ పార్టీ శ్రేణులు చేపట్టిన రిలేదీక్షలు శుక్రవారమూ కొనసాగాయి. గుంటూరులో తూర్పు నియోజకవర్గం ఇన్‌ఛార్జి నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో పెదకాకాని రోడ్ పరమాయ కుంట వద్ద రిలే నిరాహార దీక్షా నిర్వహించారు. దీక్షలకు జెడ్‌పి మాజీ చైర్‌పర్సన్ కూచిపూడి విజయ, టిడిపి రాష్ట్ర కమిటీ నాయకులు మద్దిరాల మ్యాణి, పిల్లి మాణిక్యారావు, దాసరి రాజమాస్టర్, చిట్టిబాబు పాల్గొని సంఘీభావం తెలిపారు. టిడిపి లీగల్‌సెల్ అధ్యక్షులు చుక్కపల్లి రమేష్ ఆధ్వర్యంలో న్యాయవాదులు, జనసేనకు చెందిన న్యాయవాదులు గుంటూరులోని జిల్లా కోర్టు ప్రాంగణం నుండి పోలీసు పెరెడ్‌గ్రౌండ్ వరకూ నిరసన ర్యాలీ నిర్వహించారు. తెనాలిలో టిడిపి లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణ వెలుపల నిరసన వ్యక్తం చేశారు. తెనాలి పట్టణంలో చేపట్టిన నిరసన దీక్షలో శుక్రవారం ఎమ్మెల్సీ పి.అనురాధ, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. తాడేపల్లిలోని టిడిపి కార్యాలయంలో తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు విలేకర్లతో మాట్లాడి చంద్రబాబు అరెస్టును ఖండించారు. మంగళగిరిలో దీక్షలు మూడో రోజు చేరాయి. గౌతమ్ బుద్ధ రోడ్ లోని వైష్ణవి కళ్యాణ మండపం పక్కన దీక్ష శిబిరం ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో టిడిపి లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోర్టు ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. వినుకొండ పట్టణంలోని శివయ్య స్తూపం వద్ద టిడిపి శ్రేణులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం మూడోరోజుకు చేరాయి. సాయంత్రం దీక్షలను టిడిపి జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు విరమింపజేశారు. శిబిరం వద్దకు జీవీ ఆంజనేయులు రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు యత్నించినా ఆయన ద్విచక్ర వాహనంపై వచ్చారు. పెదకూరపాడు దీక్షా శిబిరంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడారు. సత్తెనపల్లి కోర్టు వెలుపల టిడిపి లీగల్ సెల్ న్యాయవాదులు నిరసన తెలిపారు. అనంతరం తాలూకా సెంటర్లో వున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండలంలోని రామకృష్ణాపురం అడ్డరోడ్డు వద్ద దీక్షలును తెలుగు యువత నాయకులు మన్నెం శివనాగమల్లేశరరావు ప్రారంభించారు. విజయపురిసౌత్ రిలేదీక్షల్లో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడారు.