Sep 15,2023 21:31

ప్రజాశక్తి - ద్వారకాతిరుమల
        చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టిడిపి, జనసేన ఆధ్వర్యంలో ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయానికి చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. మండలంలోని మారంపల్లి నుండి శుక్రవారం ఉదయం జనసేన, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాదయాత్రగా ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయానికి బయలుదేరారు. టిడిపి మండల అధ్యక్షులు సత్తిపండు, జనసేన మండల అధ్యక్షులు దాకారపు నరసింహమూర్తి నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధికసంఖ్యలో ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్ర తిరుమలంపాలెం వద్దకు రాగానే పోలీసులు అడ్డుకుని, పోలీస్‌ వాహనం, తాళ్లు అడ్డుపెట్టి అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న తమను అడ్డుకోవడం దారుణమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించారు. ఈ క్రమంలో టిడిపి నాయకులకు, పోలీసులకు మధ్య తీవ్రవాగ్వివాదం, తోపులాటలు జరిగాయి. అనంతరం పోలీసులను తోసుకుంటూ మహిళలు, నాయకులు, కార్యకర్తలు ముందుకుసాగారు. ద్వారకాతిరుమల చేరుకుని తొలుత అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం శ్రీవారి పాదాల వద్ద కొబ్బరికాయలు కొట్టి చంద్రబాబుకు బెయిల్‌ రావాలంటూ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
చింతలపూడి : సిఎం జగన్‌ కళ్లల్లో ఆనందం చూడడానికి సిఐడి చంద్రబాబుని అరెస్ట్‌ చేసిందని మాజీ ఎంఎల్‌ఎ గంటా మురళీ, ఎఎంసి మాజీ ఛైర్మన్‌ జగ్గవరపు ముత్తారెడ్డి అన్నారు. చింతలపూడిలో చేపట్టిన 'బాబుతో నేను' రీలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజైన్‌టెక్‌ ఖాతాలను స్తంభింపజేస్తే హైకోర్టు విడుదల చేసిందని, ఆ సంస్థ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాలు, సరఫరా చేసిన పరికరాల వివరాలన్నీ హైకోర్టుకు ఇచ్చారని, ఇడి విచారణలోనూ చంద్రబాబుకు డబ్బులు వచ్చాయని ఎక్కడా నిర్ధారించలేదన్నారు. జగన్‌ కళ్లలో ఆనందం చూడ్డానికే చంద్రబాబును అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. ఈ దీక్షకు జనసేన నేతలు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు మాటూరి వెంకట్రామయ్య, ప్రధాన కార్యదర్శి కోండ్రు దేవా, నియోజకవర్గ నాయకులు బొమ్మాజీ అనిల్‌, సొంగా రోషన్‌, లీలా ప్రశాంతి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం : చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ పట్టణంలో టిడిపి నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరింది. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, జెడ్‌పిటిసి మాజీ సభ్యులు శీలం రామచందర్రావు, నాయకులు మండల లక్ష్మణరావు, మండవ లక్ష్మణరావు, పరిమి సత్తిపండు, తడకమళ్ల గోపాలరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతలపూడి జనసేన కన్వీనర్‌ మేకా ఈశ్వరయ్య దీక్షకు సంఘీభావం తెలిపారు.
కైకలూరు : చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టిడిపి నేతలు చేపట్టిన దీక్షలు కైకలూరులో కొనసాగాయి. మండలంలోని ఆటపాక పార్టీ కార్యాలయం వద్ద ఈ దీక్షలు చేపట్టారు.
ఆగిరిపల్లి : రాజకీయ దురుద్దేశంతో సిఎం జగన్‌ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించారని నూజివీడు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అన్నారు. 'నేను సైతం బాబుతో' కార్యక్రమంలో భాగంగా ఆగిరిపల్లిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం.కోటేశ్వరరావు, ఎ.రవీంద్ర, సుబ్బరాజు, నరసింహారావు, ఖాధర్‌, జోషిబాబు, సాంబశివరావు పాల్గొన్నారు.
ముసునూరు : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ముసునూరులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో కాట్రేనిపాడుకు చెందిన మహిళలు పాల్గొన్నారు. ఈ దీక్షను నూజివీడు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు సందర్శించారు. ఈ కార్యక్రమంలో సూర్యదేవర నాగమంజుల, గద్దల సుహాసిని, రాపర్ల ప్రతాప్‌, రాపర్ల బాలకృష్ణ, గద్దే రఘుబాబు, మందలపు ధర్మరాజు, సొంగా ఇస్సాక్‌, లక్కపాం కాంతారావు, పాల్గొన్నారు.
ముదినేపల్లి : చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ ముదినేపల్లిలో టిడిపి శ్రేణులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. టిడిపి కార్యాలయం వద్ద కొడాలి వినోద్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షలో పార్టీ మండల మాజీ అధ్యక్షులు చల్లగుళ్ల శోభనాద్రి చౌదరి, దావు నాగరాజు, ఈడే సుధాకర్‌, బి.రవి, పి.సురేష్‌, వంశీధర్‌, రాకేష్‌, రవికుమార్‌, పంతగాని సురేష్‌ పాల్గొన్నారు. ఈ దీక్షలకు ముస్లిము సోదరులు తమ సంఘీభావం తెలిపారు.