ప్రజాశక్తి-కందుకూరు : టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ నియోజకవర్గంలో రెండో రోజు నిరసనలు కొనసాగాయి. ఆదివారం తెల్లవారు జామున కూడా బడేవారిపాలెంలోని ఇంటూరి నాగేశ్వరరావు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇంట్లో నుంచి బయటకు రావద్దంటూ నోటీసులు ఇచ్చారు. నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి, పోలీసులను అడ్డుకొని నాగేశ్వరరావుని ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చారు. తర్వాత పక్కనే ఉన్న పామూరు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. అక్కడ పోలీసులకు, పార్టీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు టిడిపి కార్యకర్తలు, నాయకులను పక్కకు నెట్టేసి, నాగేశ్వరావుని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. కందుకూరు పోలీస్టేషన్‌కు తరలిస్తున్నట్లు ముందుగా సమాచారం ఇచ్చి, తర్వాత నాటకీయ ఫక్కీలో వలేటివారిపాలెం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణష్ట్రలు పోలీస్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు.
కందుకూరులో పార్టీ కార్యాలయం వద్ద..
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా కందుకూరు లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నిరాహార దీక్షలు చేశారు. పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు తో నాయకులు దీక్షకు కూర్చున్నారు. తొలుత ఎన్‌టిఆర్ విగ్రహానికి పార్టీ సీనియర్ నేత కె మాల్యాద్రితో పాటు పలువురు నాయకులు పూలమాలవేసి దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు.










