Sep 20,2023 20:32

ప్రజాశక్తి - ఆచంట
వైసిపి నీచ రాజకీయాలను ప్రజలంతా గమనిస్తున్నారని ఎంపిపి దిగమర్తి సూర్యకుమారి అన్నారు. ఆచంటలో టిడిపి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 8వ రోజు బుధవారం కొనసాగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టిడిపికి రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక జగన్మోహన్‌రెడ్డి చంద్రబాబుపై స్కిల్‌ కుట్రకు పాల్పడ్డారని విమర్శించారు. కార్యక్రమంలో సర్పంచి గుబ్బల మాధవరావు, వైస్‌ ఎంపిపి తాళం శ్రీనివాసరావు, నేతలు పాల్గొన్నారు.
భీమవరం రూరల్‌ : టిడిపి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో భీమవరం టిడిపి కార్యాలయం వద్ద చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ రిలే నిరాహార దీక్షలు బుధవారం 8వ రోజు కొనసాగించారు. ఈ శిబిరాన్ని టిడిపి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి ప్రారంభించి మాట్లాడారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి వేండ్ర శ్రీనివాస్‌, కష్ణ బలిజ సాధికార కమిటీ రాష్ట్ర సభ్యుడు గంటా త్రిమూర్తులు మాట్లాడారు. దీక్షకు మాజీ ఎంఎల్‌ఎ పులపర్తి రామాంజనేయులు, వైశ్య కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ వబిలిశెట్టి కనకరాజు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో భీమవరం మండల అధ్యక్షుడు రేపు వెంకన్న, వీరవాసరం మండల ప్రధాన కార్యదర్శి వీరవల్లి శ్రీనివాస్‌, ఎంపిటిసి కడలి నెహ్రూ పాల్గొన్నారు.
పాలకొల్లు రూరల్‌ : మండలంలోని వరిదనం గ్రామంలో బుధవారం చంద్రబాబు నాయుడుకు మద్దతుగా సంఘీభావంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛందంగా మహిళలు, యువత రోడ్డుపైకొచ్చి వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కర్నేని గౌరినాయుడు, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కర్నేని రోజా రమణి, నేతలు పాల్గొన్నారు.
నరసాపురం టౌన్‌ : చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ టిడిపి నియోజకవర్గ నాయకులు నిర్వహిస్తున్న దీక్షకు జనసేన సంఘీభావం తెలిపింది. పట్టణ ప్రధాన సెంటర్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. దీక్షలకు జనసేన నేత బొమ్మిడి నాయకర్‌ సంఘీభావం తెలిపి మాట్లాడారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.