Dec 21,2022 23:47

మద్దతు తెలుపుతున్న విలేకర్ల సంఘం నేతలు

ప్రజాశక్తి -పాడేరు: స్థానిక ఐటీడీఏ వద్ద విద్యార్థి, కార్మిక, మహిళా గిరిజన సంఘాల వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం మూడవరోజు కొనసా గాయి. మూడవరోజు దీక్షలలో స్థానిక గిరిజన విలేకరుల సంఘం మద్దతునిచ్చి రిలే దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు . ఈ సందర్భంగా సంఘం నాయకులు సూర్యారావు, రమణ మాట్లాడుతూ, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో తల్లిదండ్రులు, విద్యార్థి, ప్రజా సంఘాలు, మీడియా ప్రతినిధులను అనుమతి లేదని జారీ చేసిన కాంతిలాల్‌ దండే సర్కులర్‌ తక్షణమే రద్దు చేయాలన్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి మూడు నెలలకు డిప్యూటీ వార్డెన్‌లను నియమించి ఐటీడీఏ మూడు శాతం కమీషన్లను మింగేస్తుందని ఆరోపించారు. ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ కూడ రాధాకృష్ణ, కో కన్వీనర్‌ కిలో ప్రభుదాస్‌లు మాట్లాడుతూ, గిరిజన ప్రాంతం అభివృద్ధికి కృషి చేయవలసిన పాడేరు ఐటీడీఏ పీవో గిరిజన ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులపై వేధింపులకు పాల్పడం సరికాదని, తక్షణమే సరెండర్‌ చేయాలన్నారు. గిరిజన విద్యార్థుల వరస మరణాల పై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. పెదబయలు తహసీల్దార్‌ ఆత్మహత్యపై ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని. బాధ్యులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ఐక్య వేదిక కో కన్వీనర్లు మువ్వాళ లక్ష్మణరావు, చిన్నారావు, చిట్టిబాబు, లతా కుమారి, గిరిజన విలేకరుల సంఘం సభ్యులు మోహన్‌, సునీల్‌, రామచంద్రరావు, రాజు, తదితరులు పాల్గొన్నారు.