Aug 10,2023 22:59

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: విజయవాడ రైల్వే స్టేషన్లో పనిలో నుండి తొలగింపబడిన కాంట్రాక్ట్‌ కార్మికులు గురువారం మూడవ రోజు నిరాహార దీక్షను కొనసాగించారు. శ్రామిక మహిళ రాష్ట్ర కన్వీనర్‌ కె.ధనలక్ష్మి దీక్షను ప్రారంభించి మాట్లాడుతూ కార్మికుల పోరాటానికి పూర్తి మద్దతును తెలియజేశారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు పట్టుదలగా ఉద్యమాన్ని కొనసాగించాలని తెలియజేశారు. కార్మికులను పనిలో నుండి అక్రమంగా ఆపేసి వాళ్ళు పస్తులు ఉండే పరిస్థితి కాంట్రాక్టర్‌, రైల్వే అధికారులు కల్పించారన్నారు. కాంట్రాక్టర్‌ మొండి వైఖరి మానుకోకపోతే ఈ ఉద్యమాన్ని ఉదతం చేస్తామని హెచ్చరించారు. రైల్వే అధికారులు తమ బాధ్యతను సక్రమంగా నెరవేర్చి కార్మికులను త్వరగా పనిలో పెట్టించాలని కోరారు. ఇప్పటికే కార్మికులను పని నుండి ఆపి నెల రోజులు దగ్గర పడుతుందని, అయినా అధికారులు కాంట్రాక్టర్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళా ఎన్‌టిఅర్‌ జిల్లా కన్వీనర్‌ ఎ.కమల, సీఐటీయూ నాయకులు ఎస్‌.సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.