Dec 29,2022 23:36

దీక్షను చేపడుతున్న ప్రజా సంఘాల నేతలు

ప్రజాశక్తి -పాడేరు:ఐటీడీఏ ఎదుట గిరిజన విద్యార్థి, ఉపాద్యాయ, ఉద్యోగ, ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు గురువారం 11వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా ప్రజా సంఘాల వేదిక కన్వీనర్‌ కె. రాధాకృష్ణ, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ కె.రాజశేఖర్‌, కో కన్వీనర్‌ ప్రభుదాస్‌ మాట్లాడుతూ, ఐటిడిఎ పివోను సరెండర్‌ చేయాలని చేస్తున్న దీక్షలకు ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. 11 రోజులైనా అధికారుల్లో స్పందన కరువైందని విమర్శించారు. గిరిజన విద్యార్థుల సమస్యల పరిష్కారం పట్ల ఇంత నిర్లక్ష్యం తగదని విమర్శించారు. పిఓ నిర్లక్యంతోనే గిరిజన విద్యార్థులు మృత్యువాత పడుతున్నారన్నారు. పాడేరు తలారిసింగి ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఎస్‌. దోని అనే విద్యార్థి మృత్యువాత పడ్డాడని, అదే పాఠశాలలో అధికారులు సంబరాలు చేస్తున్నారని, ఇది అధికారుల తీరుకి నిదర్శనమని విమర్శించారు. గిరిజన విద్యార్థుల వరుస మరణాలపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జ్‌ తో విచారణ జరపాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలు పెంచాలన్నారు. పెదబయలు మండల తహశిల్ధార్‌ మృతి పై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలన్నారు. ఈ కార్యక్రమంలో నరేష్‌, చిన్నారావు, లతాకుమారి తదతరులు పాల్గొన్నారు.