Nov 08,2022 21:59

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
           పట్టణంలోని 12వ వార్డులో గడప గడపకూ మన ప్రభుత్వం మంగళవారమూ కొనసాగింది. రామచంద్రపురం మహేంద్ర షోరూం వద్ద నుండి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎంఎల్‌ఎ ఉన్నమట్ల ఎలిజా ప్రజలకు పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పార్టీ కార్యకర్తలు నవరత్నాలను అర్హులకు చేరువ చేయడంలో దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బత్తిన లక్ష్మి, వైస్‌ఛైర్మన్‌ ముప్పిడి వీరాంజనేయులు, మున్సిపల్‌ కమిషనర్‌ పి.భవానీ ప్రసాద్‌, పట్టణ అధ్యక్షులు చంద్రరావు, రీజనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ చైల్డ్‌ అండ్‌ ఉమెన్‌ వెల్ఫేర్‌ వందనపు సాయిబాలపద్మ, కౌన్సిలరు, వాలంటీర్లు, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొయ్యలగూడెం:అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ భూస్థాపితమై ఫలితం అనుభవిస్తుందని పోలవరం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు అన్నారు. మంగళవారం మండలంలోని పరింపూడి సచివాలయం-1 పరిధిలో ఎంపిటిసి గంటా శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ ఏనాడూ స్వతంత్రంగా ఎన్నికల్లో విజయం సాధించి పాలన సాగించలేని చంద్రబాబు ఈదఫా కూడా దత్తపుత్రుడి కోసం తహతహలాడుతున్నారన్నారు. ఈ నాటకాలు రాష్ట్రంలో సాగవని, వైసిపిదే మళ్లీ విజయమని అన్నారు. కార్యక్రమంలో ఎంపిపి గంజిమాల రామారావు, మాజీ ఎంపిపి మట్టా సత్తిపండు, పట్టణ కన్వీనర్‌ శంకు కొండ, ఎంపిటిసి తేలే శ్రీను, నాయకులు ముప్పిడి వెంకట్రావు, నిక్కర్‌ నాగేశ్వరరావు, చిడిపి రవి, విగ్గిన రామకృష్ణ, కడిమి సూరిబాబు, నిడదవోలు రాజ్యలక్ష్మి, ఊసల బోసు, తోంటా వాసు, కట్టా రాము, నారా అన్నపూర్ణాదేవి, సోలం వెంకటరమణ పాల్గొన్నారు.
ముదినేపల్లి:ప్రజా సంక్షేమమే వైసిపి ధ్యేయమని కైకలూరు ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని చిగురుకోట సచివాలయం పరిధిలోని చినకామనపూడి, నరసన్నపాలెం గ్రామాల్లో మంగళవారం గడపగడపకూ మనప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వందో రోజుకు గడపగడపకూ మన ప్రభుత్వం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం వంద రోజుల పండుగకు నియోజకవర్గంలోని నాలుగు మండలాలు నుంచి భారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని ఎంపిపి రామిశెట్టి సత్యనారాయణ కోరారు. ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమం చేపట్టి బుధవారంతో వంద రోజులు పూర్తి చేసుకుంటుందన్నారు. చిగురుకోటలో జరిగే ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరు రావాలని, ఈ కార్యక్రమానికి ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌బాబు ముఖ్యఅతిధిగా విచ్చేస్తున్నారని తెలిపారు.