Mar 24,2023 21:01

144, 145 సెక్షన్‌లు ఎత్తివేయాలి
కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులు, అసైన్డ్‌, సీలింగ్‌ చట్టాల అమలు చేయాలి
9/77చట్టం ప్రకారం భూములు పేదలకు ఇవ్వాలి
దీక్షలో పాల్గొన్న నేతలు, దళితుల డిమాండ్‌
ప్రజాశక్తి - దెందులూరు

మండలంలోని దోసపాడుకు చెందిన పేదల భూములను అక్రమంగా అనుభవిస్తున్న భూస్వాముల నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని దళితులకు పంపిణీ చేయాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం రెండో రోజూ కొనసాగాయి. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ రిలే నిరాహార దీక్షలను ప్రారంభించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ, కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ దోసపాడు పేదలు, దళితులు పది నెలల నుండి అసైన్డ్‌, సీలింగ్‌, గయాళ భూములు పంచాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోరాడుతున్నారన్నారు. 25 ఏళ్ల నుండి స్థానికేతర భూస్వాములు దౌర్జన్యంగా, అన్యాయంగా బలవంతంగా పేదల భూములను లాక్కొని దర్జాగా అనుభవిస్తున్న వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రభుత్వం తక్షణం దోసపాడు భూములపై 144, 145 సెక్షన్లు ఎత్తివేయాలని కోరారు. భూములు అన్యాక్రాంతం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆక్రమణదారులపై ఎస్‌సి, ఎస్‌టి నిరోధక చట్ట ప్రకారం కేసు కట్టినప్పటికీ నేటికీ అరెస్ట్‌ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను నవరత్నాలుగా ప్రకటించిందని దీనిలో భూమి లేకపోవడం అన్యాయమన్నారు. 25 ఏళ్లుగా పేదల భూములను విజయవాడకు చెందిన దేవినేని బాజీప్రసాద్‌ ఆయన కుమారుడు చందు, బీహార్‌కు చెందిన కుమార్‌ పప్పుసింగ్‌ ఆక్రమించుకుంటే ఏ చట్టాలూ వర్తించవా అని ప్రశ్నించారు. పేదల భూముల సర్వే నంబర్లు ఆధారంగా 208, 213, 214, 216, 225, 226,227 231లో సుమారు 150 ఎకరాల భూమి 1973 ముందు ప్రభుత్వం అసైన్డ్‌ చేసి పేదలకు ఇచ్చిందని తెలిపారు. అలాంటి భూములను నేడు భూస్వాములు ఆక్రమించుకుని దర్జాగా అనుభవిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా అసైన్డ్‌, సీలింగ్‌ భూములను పేదలకు ఇవ్వాలని కోరారు. ఈ రిలే నిరాహార దీక్షలో పి.గంగాధర్‌, సిహెచ్‌.లలిత, గోరింక శిరీష, దేవకృపామణి, కమలకుమారి, జి.సౌదామణి, పి.ఆనందరావు, డి.నాగేంద్ర, కె.వినోద్‌, జి.లక్ష్మి, కుమారి పాల్గొన్నారు.