రెండు జిల్లాల్లో దిగుబడులకు, కొనుగోలు లక్ష్యాలకు పొంతన కరువు
లక్ష్యం పూర్తయిందని కొన్ని మండలాలకు సంచులు నిలిపివేత
మండలాల్లో అధికారులను నిలదీస్తున్న రైతులు
మరోపక్క తుపాన్ హెచ్చరికలతో రైతుల గుండెల్లో గుబులు
ధాన్యం కొనేందుకు ముందుకు రాని మిల్లర్లు, వ్యాపారులు
కొనసాగుతున్న లారీల సమస్య
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
'ధాన్యం నూతన కొనుగోలు విధానంలో మిల్లర్లు, ధాన్యం వ్యాపారుల ప్రమేయం లేకుండా చేశాం. రైతులకు మేలు చేసేలా అన్ని చర్యలూ తీసుకున్నాం. ఇ-క్రాప్ పూర్తయిన ప్రతి ఎకరా ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది' అని నిన్నటి వరకూ ఊదరగొట్టారు. ఇప్పుడేమో నిర్ధేశించిన లక్ష్యం వరకూ మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తామని, బహిరంగ మార్కెట్లో అమ్ముకోవాలని చెబుతున్న పరిస్థితి నెలకొంది. 'మీకిచ్చిన లక్ష్యం పూర్తయిందని, ఇక సంచులు ఇచ్చేది లేదని మండలాల్లోని అధికారులకు చెప్పడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లాలవ్యాప్తంగా వచ్చే వరి దిగుబడులకు.. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యానికి ఏమాత్రం పొంతన లేదని స్పష్టమవుతోంది. ఒకపక్క వాతావరణ మార్పులు, మరోపక్క ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.
ఖరీఫ్‌లో పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా 1.99 లక్షల ఎకరాల్లో వరిసాగు సాగింది. ఐదు లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే ఇక్కడ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని నిర్ధేశించుకున్న ధాన్యం లక్ష్యం 3.42 లక్షల టన్నులు మాత్రమే. ఏలూరు జిల్లాలో రెండు లక్షలకుపైగా ఎకరాల్లో వరిసాగు సాగింది. ఇక్కడ కూడా దాదాపు ఆరు లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి తీసుకున్న లక్ష్యం మాత్రం 3.80 లక్షల టన్నులు మాత్రమే. దీన్నిబట్టి చూస్తే పండిన పంటలో సగం ధాన్యం మాత్రమే కొనుగోలు చేసేలా లక్ష్యాలు కన్పిస్తున్నాయి. మిగిలిన ధాన్యం కొనుగోలు పరిస్థితి ఏమిటనే ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం లేకుండాపోయింది. ఇప్పటికే ఇచ్చిన లక్ష్యానికి సరిపడా ధాన్యం కొనుగోలు చేశారని, ఇక సంచులు ఇవ్వడం కుదరదని పలు మండలాలకు చెబుతున్నట్లు తెలుస్తోంది. ధాన్యం కొనుగోలు చేయాలని మండలాల్లోని అధికారులను రైతులు చుట్టుముడుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. మిల్లర్లు, వ్యాపారుల ప్రమేయం లేకుండా చేస్తానని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడేమో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం ఏమిటని అంతా తలలు పట్టుకుంటున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు రైతులను దోచుకునేందుకు సిద్ధమయ్యారు. ధాన్యం అమ్మకానికి వెళ్తే వ్యాపారులు, మిల్లర్లు ఇష్టమొచ్చిన ధరకు అడుగుతున్న పరిస్థితి ఉందని రైతులు చెబుతున్నారు. చాలాచోట్ల ధాన్యం కొనుగోలు చేసేందుకు మిల్లర్లు, వ్యాపారులు సైతం ముందుకు రాకపోవడంతో రైతులకు ఏం చేయాలో అర్ధంకాని దుస్థితి నెలకొంది. మరోపక్క బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. అందుకు తగినట్లుగా వాతావరణంలో సైతం పెను మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోపక్క లక్ష్యం ప్రకారమే ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులకు ఏంచేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.
తీరని లారీల సమస్య
ధాన్యం తరలింపునకు సంబంధించి లారీల సమస్య మాత్రం ఏలూరు జిల్లాలో రైతులను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇప్పటికీ పూర్తిస్థాయిలో వాహనాలు రావడం లేదు. ఆయా మండలాలకు రోజుకు 20 లారీలు అవసరముంటే కేవలం ఏడెనిమిది లారీలు మాత్రమే వస్తున్నాయి. దీంతో ధాన్యం తరలింపు మందకొడిగా సాగుతోంది. ధాన్యం కల్లాలోనే ఉండిపోవడంతో వాతావరణ హెచ్చరికలు రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. లారీలు అధిక సంఖ్యలో వెళ్తే బస్తాల్లో పట్టిన ధాన్యం త్వరితగతిన పూర్తవుతోంది. చాలామంది రైతులు బస్తాలో ధాన్యం పట్టి ఐదురోజులపైనే ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది.










