ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్: తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం వచ్చే చిరుధాన్యాలను సాగు చేయాలని రైతులకు పల్నాడు జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఐ.మురళి సూచించారు. జాతీయ ఆహార భద్రత మిషన్ పథకం క్రింద చిరు ధాన్యాలు సాగు, కంది పంట సాగు విస్తీర్ణం పెంపుపై మండలంలోని ధూళిపాళ్లలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులందరూ తమకున్న కొంత భూమిలో మంచి పోషక విలువలు అందిస్తున్న చిరు ధాన్యాలైన రాగులు, కొర్రలు, సామలు, వరిగలు సాగు చేసుకోవాలని సూచించారు. ఈ పంటలకు పెట్టుబడి తక్కువని, తక్కువ కాలంలో పంట చేతికి వస్తుందని చెప్పారు. రైతులు తమ మొత్తం విస్తీర్ణంలో కొంతైనా వీటిని సాగుచేసి తమ కుటుంబ అవసరాలకు వినియోగించుకోవడంతోపాటు ఇతరులకూ అందించాలని సూచించారు. పత్తి పంటలో మిశ్రమ పంటగా లేదా పత్తి పంట చుట్టూ కంచె పంటగా కందిని సాగు చేసుకోవాలన్నారు. అనంతరం నూరు శాతం రాయితీపై కంది, రాగుల విత్తనాలను రైతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా వ్యవసాయ కార్యాలయం ఎడిఎ సిహెచ్ రవికుమార్ సత్తెనపల్లి ఇన్‌ఛార్జి ఎడిఎ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.










