* తోటలో యువతి మృతదేహం
* హత్య, ఆత్మహత్యా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: ఎచ్చెర్ల మండలం కొంగరాం తోటల్లో గుర్తు తెలియని యువతి మృతదేహం మంగళవారం లభ్యమైంది. నోటి నుంచి నురగలు కక్కుతూ ఉన్నట్లుగా కనిపించింది. గ్రామానికి చెందిన స్థానికులు మృతదేహాన్ని చూసి సర్పంచ్ రవికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయన ఎచ్చెర్ల ఎస్‌ఐ సత్యనారాయణకు తెలియజేశారు. ఆయనతో పాటు అదనపు ఎస్‌పి విఠలేశ్వరరావు, జెఆర్ పురం సిఐ ఆదాం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అమ్మాయి వయసు 17, 18 ఏళ్లు ఉంటాయని తెలుస్తోంది. నాలుగు అడుగుల తొమ్మిది అంగుళాల ఎత్తు ఉండొచ్చని పోలీసులు చెప్తున్నారు. నీలం, గులాబీ రంగు చెక్స్ డిజైన్ టాప్, పూల డిజైన్ గల తెలుపు రంగ స్కర్ట్ ధరించింది. ఆమె మెడపై గాయాలున్నట్లు గుర్తించారు. ఇది హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. యువతి వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఆత్మహత్య ఏమైనా చేసుకుందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ సాగిస్తున్నారు. మృతదేహం ఆనవాళ్లు బట్టి దీన్ని హత్యగానే స్థానికులు భావిస్తున్నారు. యువతిని హత్యాచారం చేసి వాహనంలో తెచ్చి ఇక్కడ పడేసి ఉండొచ్చన్న అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. యువతి వివరాల కోసం పోలీసులు అన్వేషణ మొదలుపెట్టారు. ఆమె ఫొటోతో ఒక ప్రకటన విడుదల చేశారు. యువతిని ఎవరైనా గుర్తిస్తే తమకు తెలియజేయాలని జెఆర్‌పురం సిఐ ఆదాం ఫోన్ నంబరు 6309990816, ఎచ్చెర్ల ఎస్‌ఐ సత్యనారయణ ఫోన్ నంబరు 6309990853 నంబర్లకు తెలియజేయాలని పోలీసులు కోరారు. పోస్టుమార్టం కోసం యువతి మృతదేహాన్ని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.










