Jun 11,2023 23:48

నిరసన తెలుపుతున్న రైతులు

ప్రజాశక్తి-తాడేపల్లి : తూటుకాడతో నిండిపోయి వాగు ఆనవాళ్లు కూడా కనబడకుండా గుర్రపుడెక్క విస్తరించిన నేపథ్యంలో పాలకులు కొండవీటి వాగును పట్టించుకోరా అని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జొన్నా శిశశంకరరావు ప్రశ్నించారు. కొండవీటి వాగులో తూటుకాడ, గుర్రపుడెక్క తొలగించాలని ఆదివారం వాగు సమీపంలో నిరసన వ్యక్తం చేశారు. శివశంకరరావు మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో దు:ఖదాయినిగా పేరుగాంచిన కొండవీటి వాగు మరమ్మతును ప్రభుత్వం నాలుగేళ్లుగా పట్టించుకోవడం లేదన్నారు. వాగు వల్ల సంభవించే నష్టాలు, కష్టాలకు పాలకవర్గ పార్టీలే బాధ్యత వహించాలన్నారు. తాడికొండ, మంగళగిరి నియోజక వర్గాల్లో పారుదలయ్యే కొండవీటి వాగు సమస్యను పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తాడికొండలోని లాం నుంచి ప్రారంభమయ్యే కొండవీటి వాగు కృష్ణానది వాగు హెడ్‌స్లూయిస్‌ వద్ద నదిలో కలుస్తుందని చెప్పారు. వాగులో గుర్రపుడెక్క, తూటుకాడ పేరుకుపోవడం వల్ల నీరు పారుదల తగ్గి వాగులోని నీరు దుర్వాసన వస్తోందన్నారు. వాగు ఎత్తిపోతల పథకం గత ప్రభుత్వ హయాంలో రూ.కోట్లతో చేపట్టినా ముంపు బారినుంచి రైతులు బయట పడలేకపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. సిఆర్‌డిఒ, ఇరిగేషన్‌ అధికారులు బాధ్యత మీదంటే మీదని పక్కకు తప్పుకోవడం సరికాదని, ఇప్పటికైనా స్పందించి కొండవీటి వాగులోని తూటుకాడను తొలగించాలని కోరారు. కార్యక్రమంలో రాజధాని రైతు సంఘం అధ్యక్షులు ఈశ్వరరెడ్డి, ఉండవల్లి అధ్యక్షులు బక్కిరెడ్డి, వీరాస్వామి, కె.రమేష్‌, బుజ్జి, పోతురాజురెడ్డి, డి.సాంబశివరావు, ఎస్‌కె పీరూసాహెబ్‌ పాల్గొన్నారు.