ప్రజాశక్తి-తాడేపల్లి : మంగళగిరి నియోజకవర్గంలో రైతుల దు:ఖదాయినిగా ఉన్న కొండవీటి వాగు సమస్య పరిష్కారానికి రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమించాల్సిన అవసరముందని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య పిలుపునిచ్చారు. సోమవారం మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల రైతుల సమావేశం ఉండవల్లి గుహలు ఎదురుగా గల కొండవీటి వాగు ఒడ్డున నిర్వహించారు. సమావేశానికి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జొన్నా శివశంకరావు అధ్యక్షత వహించారు. కృష్ణయ్య మాట్లాడుతూ వాగు మొదలయ్యే తాడికొండ మండలం లాం నుంచి ఉండవల్లిలో కృష్ణానదిలో కలిసే వరకు ఎక్కడ వాగు ఒడ్డు బలహీనంగ ఉందో? ఎక్కడ వాగుకు రివిట్‌మెంట్ చేయాలి ఉందో? గుర్తించకపోవడం అధికారుల తప్పిదమేనన్నారు. కేవలం వాగులో గుర్రపు డెక్క, తూటుకాడ, మెరకల వల్లనే పొలాలు మునడగంలేదని, కొండవీటి వాగును ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ముంపు ప్రాంతాల్లోని పొలాలను గుర్తించి లైనప్ చేయాలని, ఈ విషయం మీద ఇంజినీర్లను కలిసి డిజైన్ రూపొందించడానికి రైతు సంఘం సిద్ధంగా ఉందని చెప్పారు. సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి కె.అజరుకుమార్ మాట్లాడుతూ సస్యశ్యామలైన ఈ ప్రాంతలో కూరగాయలు, పూలు, ఆకుకూరలు, ఇతర ఆహార, వాణిజ్య పంటలు పండుతాయని, ఇలాంటి భూమి దేశంలోనే ఎక్కడా లేదని అన్నారు. అలాంటి భూముల్లో ఇప్పుడు పంటలే లేవన్నారు. నిత్య ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. వాగును బాగు చేస్తామని గత హోం మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే సుచరిత హామీనిచ్చినా నెరవేరలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు కొండవీటి ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. తెలుగు రైతు సంఘ రాష్ట్ర నాయకులు కళ్లం రాజశేఖరరెడ్డి నాయకులు, ఎన్.రామారావు మాట్లాడుతూ రాజధానిని బలి పశువును చేయడానికి ప్రభుత్వం కొండవీటి వాగు సమస్యను పరిష్కరించడం లేదన్నారు. జనసేన పార్టీ నాయకులు సుందరయ్య మాట్లాడుతూ సమస్యను రాజకీయ కోణంలో చూడకుండా పరిష్కరించాలన్నారు. వెంకటపాలెం మాజీ సర్పంచ్ బెల్లంకొండ నరసింహారావు మాట్లాడుతూ ప్రయత్నం చేయడం, పోరాటంతో ముందుకు పోవడంతో కొండవీటి వాగు సమస్యను పరిష్కరించుకోవచ్చన్నారు. రైతు సంఘం నాయకులు డి.వెంకటరెడ్డి మాట్లాడుతూ రాజకీయా పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట, లేనప్పుడు మరోమాట మాట్లాడి వాగు సమస్యను పరిష్కరించకుండా దాట వేస్తున్నాయని విమర్శించారు. కేవలం శిలాఫలకాలు వేసి సమస్య పరిష్కారం కాకుండా జాప్యం చేయడం క్షంతవ్యం కాదన్నారు. అనంతరం ఈనెల 14న సిఆర్‌డిఎ అధికారులను కలవాలని, స్థానిక ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇవ్వాలని, వాగు సమస్యను శాస్త్రీయంగా ఆలోచించడంతో పాటు బడ్జెట్ కేటాయించాలని కోరుతూ తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. కొండవీటి వాగు సమస్య పరిష్కార కమిటీ కన్వీనర్‌గా కళ్లం రాజశేఖరరెడ్డి, కో-కన్వీనర్‌గా కొర్రపోలు జగదీశ్వరరెడ్డితోపాటు 19 మందితో కమిటీ ఏర్పడింది. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఎస్‌కె పీరూసాహెబ్, దాసరి కృష్ణ, పి.బక్కిరెడ్డి పాల్గొన్నారు.










