ప్రజాశక్తి - పల్నాడు జిల్లా/యడ్లపాడు : కొండవీడుకోట ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ అన్నారు. సోమవారం హైకోర్టుకులో ఓ కేసు నిమిత్తం హాజరయ్యేందుకు వెళ్లిన కలెక్టర్ తిరుగు ప్రయాణంలో యడ్లపాడు మండలంలోని కొండవీడు కోట ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడున్న సందర్శకులతో కొద్దిసేపు మాట్లాడారు. చిన్నారుల కోసం ప్లే జోన్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని, సందర్శకుల కోసం క్యాంటీన్ ఏర్పాటు చేయాలని కొందరు సందర్శకులు కలెక్టర్‌ను కోరగా త్వరలోనే ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీనిచ్చారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉన్న వసతులతో పాటు, మరిన్ని సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని సంబంధిత అధికారులతో అన్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే అవుట్ రైవల్ సొల్యుషన్స్ సంస్థతో చేసుకున్న ఒప్పందం మేరకు జరుగు తున్న పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. వచ్చేనెల 27న ప్రపంచ పర్యాటక దినత్సవం నేపథ్యంలో 15 నాటికి ట్రెక్కింగ్, క్లైమ్బింగ్, రాక్ క్యాంబింగ్, బోటింగ్, నైట్ క్యాపింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. అటవీ శాఖ ద్వారా జరుగుతున్న సాహస క్రీడలు, ఇతర విన్యాసాల అభివృద్ధి పనులపై చర్చించారు. కలెక్టర్ వెంట అటవీశాఖ జిల్లా అధికారి రామచంద్రరావు, యడ్లపాడు తహశీల్దార్, ఇఒపిఆర్‌డి ఉన్నారు.










