
ప్రజాశక్తి-యడ్లపాడు : కొండవీడు కోటలో చారిత్రక, సాంస్కృతిక సమాచారాన్ని తెలియజేస్తూ కోటలో నడిబొడ్డున గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ గ్యాలరీలో క్రీస్తు శకం 13వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం వరకూ జరిగిన చారిత్రక పరిణామాలను వివరిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. క్రీస్తు శకం 1325 నుండి 1424 వరకూ కొండవీడును రెడ్డిరాజులు రాజధానిగా చేసుకొని పరిపాలించారు. మొదట అద్దంకిని రాజధానిగా రాజ్యపాలన ప్రారంభించి, రెండో రాజధానిగా కొండువీడును రాజధానిగా చేసుకొని బట్టి ప్రోలయ వేమారెడ్డి కొండవీడు కోట నిర్మాణం ప్రారంభించారు. అయితే అతని కుమారుడు అనపోతారెడ్డి నిర్మాణాన్ని పూర్తి చేసి 1353లో రాజధాని అద్దంకి నుండి కొండవీడుకు మార్చారు. ప్రోలయ వేమారెడ్డి నుండి రాచ వేమారెడ్డి వరకూ ఆరుగురు రాజులు కొండవీడు రాజధానిగా కోస్తాంధ్ర ప్రాంతాన్ని పరిపాలించారు. ఈ విషయాలన్నింటినీ క్లుప్తంగా ఈ గ్యాలరీలో పేర్కొన్నట్లు కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి తెలిపారు. ఈ సమాచారం తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఉంటుందని, కొండవీడు ఘాట్‌రోడ్డు, నగరవనానికి సంబంధించిన బోర్డు కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఘాట్ రోడ్డు ప్రారంభంలో కింద గృహరాజులు సౌధం, జడ్డిగాల బావిని గురించి ఒక బోర్డు ఉంటుందన్నారు. కోట, రాజుల చరిత్ర, సాంస్కృతిక చరిత్రతోపాటు, కొండవీడుకు సంబంధించిన ముఖ్యమైన ఫొటోలూ ఏర్పాటు చేశామన్నారు.