ప్రజాశక్తి -మధురవాడ:/ పిఎం.పాలెం : రెండురోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొండవాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత సూచించారు. శనివారం వార్డు పరిధిలోని కొండవాలు ప్రాంతాల్లో పర్యటించారు. వీడకుండా కురుస్తున్న వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను పరామర్శించారు. అధికారులను అప్రమత్తం చేశారు. సాయిరాం కాలనీలో గోడకూలిన ప్రాంతాన్ని,పరదేశీపాలెంలో దెబ్బతిన్న కాలువలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కొండవాలు ప్రాంతంలో రోడ్లు, మెట్లు మార్గాలు వర్షంతో కోతకు గురై, కుంగి ప్రమాదకరంగా మారుతున్నాయని స్థానికులు విన్నవించారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సత్వర పరిష్కారానికి చొరవ చూపుతానని హామీనిచ్చారు. కార్యక్రమంలో టిడిపి బిసి సెల్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు, జివిఎంసి వర్క్స్ ఎఇ ఎ.శ్రీనివాస్, నమ్మి రమణ పాల్గొన్నారు










