Nov 04,2022 23:49

కమిషనర్‌కు వినతిపత్రం ఇస్తున్న కార్పొరేటర్‌ హేమలత

ప్రజాశక్తి -మధురవాడ : ఐదోవార్డు పరిధిలోని కొండవాలు ప్రాంతాల్లో ప్రజల కష్టాలు తీర్చాలని జివిఎంసి ప్రధాన కమిషనర్‌ రాజాబాబుకు వినతిపత్రం ఇచ్చినట్లు కార్పొరేటర్‌ మొల్లి హేమలత తెలిపారు. వార్డు పరిధిలోని ప్రజాసమస్యలు, మౌలిక వసతుల కల్పనపై గతంలోనూ వినతిపత్రం ఇచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టలేదని కమిషనర్‌కు విన్నవించారు. అయ్యప్ననగర్‌లోని తాగునీటి పథకం నిర్మాణంలో ఏళ్లతరబడి జాప్యం జరుగుతూ, నేటికీ పూర్తికాని పరిస్థితుల్లో వివేకానంద కాలనీ, వికలాంగుల కాలనీ, ముత్యాలమ్మ కాలనీ, తదితర కొండవాలు ప్రాంతాలలోని ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. సాయిరాం కాలనీ, శారదనగర్‌ తదితర కొండవాలు ప్రాంతాల్లోనూ తాగునీటి ఎద్దడి నెలకొందని విన్నవించారు. నగరంపాలెం వుడా మాస్టర్‌ ప్లాన్‌ రోడ్‌ను మధ్యలో ఆపేయడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని దాన్ని వెంటనే పూర్తి చేయాలని కోరారు. జివిఎంసి నిధులతో మంజూరైన అనేక పనులకు శంకుస్థాపన చేసినా, నేటికీ ప్రారంభదశను దాటలేదని విన్నవించారు. సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. టిడిపి సీనియర్‌ నేత మొల్లి లక్ష్మణరావు ఉన్నారు.