May 25,2023 23:48

సేవా అవార్డుల కార్యక్రమానికి హాజరైన వాలంటీర్లు

నిబంధనల పేరిట కోతతో వాలంటీర్ల ఆవేదన
సేవామిత్ర ప్రోత్సాహమైనా అందక పలువురి నిరాశ
ప్రజాశక్తి -భీమునిపట్నం
:పెర్ఫార్మెన్స్‌ పేరిట కొంతమందిని సేవా అవార్డులకు అనర్హులుగా ప్రకటించడంతో పలువురు వాలంటీర్లు ఆవేదన చెందుతున్నారు. ఏడాది పొడుగునా తాము చేసిన సేవలకు ప్రభుత్వం ఇచ్చిన గౌరవం ఇదేనాయని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రతినెలా ఒకటోతేదీన వేకువజాముకు ముందునుంచే పింఛన్ల పంపిణీతోపాటు, ప్రభుత్వం, అధికారులు నిర్ధేశించిన కార్యక్రమాలను నిబద్ధత, చిత్తశుద్ధితో చేసిన తమ సేవలు, మూడో ఏడాది వచ్చేసరికి ఏ విధంగా తగ్గిపోయాయో అంతు చిక్కడం లేదని అంటున్నారు. అందరూ ఒకేరీతిన పనిచేస్తే, కొందరికే సేవా అవార్డులు ఇవ్వడంపై దక్కని వారంతా చిన్నబోతున్నారు. కాగా ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది వాలంటీర్లకు వందనంపేరిట సేవా అవార్డులను ప్రకటించింది. సేవావజ్రలకు రూ.30వేలు, సేవారత్నలకు రూ.20వేలు, సేవామిత్రలకు రూ.10వేలు ఆర్థికప్రోత్సాహం అందిస్తోంది.
పెర్ఫార్మెన్స్‌ పేరుతో అందని ప్రోత్సాహం
అమరావతిలోని గ్రామ, వార్డు సచివాలయ విభాగం(జిఎస్‌డబ్ల్యుఎస్‌) రూపొందించిన పెర్ఫార్మెన్స్‌ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వాలంటీర్లకు పురస్కారాలను ప్రదానం చేసింది. ఏడాదంతా పని చేసిన తమకు కనీసం సేవా మిత్ర అవార్డు కింద రూ 10 వేల ప్రోత్సాహానికైనా నోచుకోలేక పోయామా? అంటూ పలువురు గ్రామ, వార్డు వాలంటీర్లు వాపోయారు. వాలంటీర్లను, వారి సేవలను
సమయం వచ్చినప్పుడల్లా పొగడ్తలతో ముంచెత్తుతున్న ప్రభుత్వం,అవార్డులిచ్చేసరికి మొండిచేయి చూపడంపై పలువురు పెదవి విరుస్తున్నారు.
97మందికి అందని సేవా అవార్డులు
జివిఎంసి ఒకటో జోన్‌ పరిధిలో 410 మంది వార్డు వాలంటీర్లకుగాను, 313మందికే సేవా అవార్డులివ్వగా, మిగిలిన 97మందికి నిరాశే మిగలింది. వార్డుల వారీగా ఒకటో వార్డులోని ఐదు సచివాలయాల్లో 103మంది వాలంటీర్లకుగాను, 89మందికి సేవామిత్ర, ఇద్దరికి సేవా రత్న అవార్డులిచ్చారు. రెండో వార్డులో ఐదు సచివాలయాల పరిధిలో 116మందికిగాను 79మందికి సేవామిత్ర, ఇద్దరికి సేవారత్న ఇచ్చారు. మూడోవార్డులోని ఐదు సచివాలయాల్లో 96 మందికిగాను, 64మందికి సేవామిత్ర, ఒకరికి సేవా రత్న అవార్డు ఇచ్చారు. నాలుగోవార్డులో ఆరు సచివాలయాల పరిధిలో 95మంది వాలంటీర్లు ఉండగా, 72 మంది సేవామిత్ర, ముగ్గురికి సేవారత్న, ఒకరికి సేవావజ్ర అవార్డుకు ఎంపిక చేశారు.
అవార్డులకు ఎంపిక ఇలా...
వివిధ అంశాల్లో వాలంటీర్ల పనితీరు ఆధారంగాసేవా అవార్డులకు ప్రభుత్వంవారిని ఎంపిక చేసింది.
నెలలో 100 శాతం హాజరు ఉన్నటైతే 30 మార్కులు, ప్రతి నెలా ఒకటో తేదీకే వందశాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేసేత 30 మార్కులు, హౌస్‌హోల్డ్‌ సర్వే వందశాతం చేస్తే 20 మార్కులు, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సమాచారాన్ని సకాలంలో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తే, 10 మార్కులు, లబ్ధిదారులకు ప్రభుత్వ సేవలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తే 10 మార్కులు, మొత్తంగా ఐదు విభాగాల్లో వాలంటీర్లు పనితీరు ఆధారంగా ఈ అవార్డులకు ఎంపిక చేసిందని అధికారులు అంటున్నారు

ఎంపికలో ప్రమేయం లేదు

వాలంటీర్లకు సేవా అవార్డుల ఎంపికలో ప్రజాప్రతినిధులు, అధికారులు, అధికారపార్టీ నేత ప్రమేయం ఏమాత్రం లేనే లేదు. ప్రభుత్వం నిర్ధేశించిన అయిదు అంశాల్లో వాలంటీర్ల పనితీరు ఆధారంగానే అమరావతిలో ఉన్న గ్రామ వార్డు సచివాలయ విభాగం వాలంటీర్లను సేవా అవార్డులకు ఎంపిక చేసింది.
ఎల్లపు సంతోష్‌కుమార్‌, ఎపిడి,
యుసిడి విభాగం, జివిఎంసి, జోన్‌-1