ప్రజాశక్తి - రంపచోడవరం
రాష్ట్రంలోని కొండ రెడ్డి కులస్తుల అభివృద్ధికి తగు చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ అండర్ కార్యదర్శి సుశీల్ బడింగ్ పేర్కొన్నారు. మండలంలోని వేములకొండ పంచాయితీ పరిధిలోని కొండ రెడ్లకు చెందిన చేలకవీధి గ్రామంలో ఆయన పర్యటించారు. రాష్ట్రపతి పంపిన టీం ద్వారా కొన్ని గ్రామాల్లో పర్యటించి, అక్కడి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ అండర్ కార్యదర్శి సుశీల్ బడింగ్, ఎపి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ట్రైకార్ జనరల్ మేనేజర్ మణికుమార్ ఈ పర్యటన చేశారు. కొండరెడ్ల కులస్తులతో వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సుశీల్ బడింగ్ మాట్లాడుతూ దేశంలో సుమారు 720 రిజర్వేషన్‌కు సంబంధించిన కులాలు ఉన్నాయని, 75 తెగలను పివిటిజిలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. పివిటిజిల గ్రామాలను అభివృద్ధి చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని తెలిపారు. గ్రామంలోని కొండ రెడ్లకు అడవి హక్కుల చట్టం ద్వారా పట్టాలు ఎంతమందికి మంజూరు చేసింది ఆరా తీసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో సిహెచ్ శ్రీనివాసరావు, సర్పంచ్ పండు దొర, ఎంపీటీసీ నర్రి పాపారావు, డిఇలు ఏ వెంకటేశ్వరరావు, రాజేంద్ర బాబు, ఎడబ్ల్యుఓ రామ తులసి, తహశీల్దారు పివివి జయ సూర్య కుమార్, ఎంపీడీవో హరికృష్ణ, ఉపాధి పథకం ఏపీవో సాయిబాబా, ఏపిఎం అప్పారావు, వైటిసి మేనేజర్ సుదీర్, ఏఈలు సత్యనారాయణ, పి వెంకట్ రమణ, భీమశంకర్, శ్రీనివాసరావు గ్రామస్తులు పాల్గొన్నారు.










