Jul 23,2022 00:08

పాండవుల కొండను రియల్టర్‌ తవ్వేసిన దృశ్యం

- విచ్చలవిడిగా ప్రభుత్వ భూమిలో భారీ రహదారి
ప్రజాశక్తి - విశాఖపట్నం ప్రతినిధి

దాదాపు 36 అడుగుల ఈ రోడ్డు మలుపులో ఎడమ పక్కనున్న ప్రభుత్వ భూమి హెచ్చరిక బోర్డు చూస్తే మీకేమనిపిస్తోంది ? బోర్డు పైనున్నది ప్రభుత్వ భూమనిపిస్తోంది కదూ. ఈ రోడ్డుకు అవతల కొండకిందనున్న బోర్డును చూస్తే ఎవరికైనా అలా అన్పించకమానదు. కానీ... ఇక్కడే అసలు కథ ప్రారంభమైంది. తన దురాక్రమణ వ్యవహారం బయటపడకుండా ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఎంత తెలివిగా వ్యవహరించారో, అందుకు రెవెన్యూ, గనులశాఖ అధికారులు ఎలా కళ్లుమూసుకొని, 'తెలీదన్న' ముసుగు వేసుకొని ఆ వ్యాపారికి సహకరించారో ఈ కథనం చదివితే మీకే అర్థమవుతుంది. ఈ దురాక్రమణ ఎక్కడో జరగలేదు. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు మండలం దేవరాపల్లిలోని ఆయన సొంతూరు తారువకు సమీపంలో చోటుచేసుకుంది.
వాకపల్లి పంచాయతీలోని బోడిమెట్ట నుంచి శారద నది సమీపంలోవున్న పాండవుల కొండపైనున్న వెంకటేశ్వర స్వామి పురాతన ఆలయం వరకు కొండకు ఆనుకొని 36 అడుగుల రోడ్డును ఆ వ్యక్తి నిర్మించాడు. ఇప్పటికీ కొండమట్టి రోడ్డు మీదకు జారకుండా రిటర్నింగ్‌ వాల్‌ నిర్మిస్తున్నాడు. వాకపల్లి జంక్షన్‌ నుంచి అల్లు సత్యనారాయణ జీడి తోట వరకు, పులిమెట్ట కొండ నుంచి మొదలుపెట్టి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ప్రభుత్వ భూమిలో భారీ రహదారి నిర్మించినా ప్రభుత్వ వ్యవస్థలన్నీ చోద్యం చూస్తున్నాయి. దాదాపు 70 ఎకరాల లే అవుట్‌కు వెళ్లేందుకు మధ్యలో కొంత భాగం తప్ప మిగిలినదంతా ప్రభుత్వ భూమిలోనే రహదారి వేశాడు. భద్రాచలానికి చెందిన ఈ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి రైతులు పొలాలకు వెళ్లే గోర్జిని కప్పి, దీనికి ఎడమవైపునున్న కొండ కిందిభాగాన్ని తొలిచేసే, మట్టిని లాగేసి రహదారి నిర్మించాడు. వాకపల్లి జంక్షన్‌ తొలి మలుపు నుంచి కొండను తవ్వడం ప్రారంభించాడు. ఇది గమనించిన దేవరాపల్లి తహశీల్దార్‌ రోడ్డు మధ్యలో ఇది ప్రభుత్వ భూమంటూ హెచ్చరిక బోర్డు పెట్టించారు. అధికార పార్టీ నాయకుల అండతో రోడ్డు మధ్యలో పాతిన హెచ్చరిక బోర్డును తీయించి, కొండ కింది భాగాన రోడ్డుకు అవతల ఎడమవైపున పాతించి తన సొంత భూమి మాదిరిగా రియల్టర్‌ రోడ్డు వేశాడు. అక్కడ ప్రారంభమైన దురాక్రమణ, దేవాలయం వరకు సాగింది. రోడ్డు నిర్మాణానికి అడ్డుగావున్న కొండ కిందిభాగాన్ని గనులశాఖ, రెవెన్యూశాఖ అనుమతిలేకుండా బ్లాస్ట్‌ చేయించాడు. ఇప్పటికీ అక్కడక్కడ మలుపు వద్ద రోడ్డు నిర్మాణానికి అడ్డంగావున్న కొండ కిందిభాగం పేల్చడానికి రంధ్రాలు చేశారు. లే అవుట్‌కు వెళ్లేందుకు జిరాయితీ భూమిలో రోడ్డు నిర్మిస్తే తాను కొన్న భూమిలో పది నుంచి పదిహేను ఎకరాల వరకు రహదారి నిర్మాణానికి పోతుంది. అందుకని లే అవుట్‌ కోసం కొన్న భూమి రోడ్డుకు పోకుండా గోర్జి, కొండను కబ్జా చేశాడు. అక్కడితో ఆగలేదు. మారేపల్లి సర్వే నెంబర్‌ 111లోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఎడమవైపున కొండను దొలిచాడు. మట్టి, రాళ్లను రోడ్డుకు ఉపయోగించాడు. ఇంకా మిగిలినది వేరే చోట జరుగుతున్న రోడ్డు పనులకు తరలిస్తున్నాడు. కొండ తవ్వకాలకు అనుమతుల విషయం అనకాపల్లి భూగర్భ గనుల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సుబ్బారాయుడు వద్ద ప్రస్తావించగా.. ఆ విషయం తనకు తెలీదని 'ప్రజాశక్తి'కి తెలిపారు. ప్రభుత్వ భూమిలో రహదారి నిర్మాణం, కొండ బ్లాస్టింగ్‌ విషయం తనకు తెలీదని దేవరాపల్లి తహశీల్దార్‌ ఎం.లక్ష్మి అన్నారు.