ప్రజాశక్తి - గోనెగండ్ల
గోనెగండ్లలో పగుళ్లు ఏర్పడి ప్రమాదకరంగా మారిన నర్సప్ప కొండను వెంటనే తొలగించాలంటూ కెవిపిఎస్, జనసేన, ప్రజా సంఘాల నాయకులు కోరారు. గురువారం ఎస్సీ కాలనీవాసులు స్థానిక హరిజనవాడ పాఠశాల వద్ద ఎమ్మిగనూరు, కర్నూలు ప్రధాన రహదారిపై అరగంట పాటు రాస్తారోకో నిర్వహించారు. కొండ చీలికలు ఏర్పడి 13 రోజులైనా పట్టించుకోలేదని, వెంటనే చర్యలు చేపట్టాలని నినాదాలు చేశారు. ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ఎస్‌ఐ తిమ్మారెడ్డి సిబ్బంది వారికి సర్ది చెప్పి విరమింపజేశారు. అనంతరం వారు ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయం చేరుకొని కార్యాలయం ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. తహశీల్దార్ వేణుగోపాల్ మాట్లాడుతూ... వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో నిరసనను విరమించారు. కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కరుణాకర్, జనసేన నాయకులు గానిగ బాష, అడ్వకేట్ వెంకటేశ్వర్లు, జుట్ల మునెప్ప, కాలనీవాసులు పాల్గొన్నారు.
రాస్తారోకో నిర్వహిస్తున్న కాలనీవాసులు










