Aug 25,2023 22:17

స్పీకర్‌కు సమస్యలు చెప్తున్న మాజీ సర్పంచ్‌ రఘురాంరెడ్డి

* రోడ్లు, కాలువలను ఎప్పుడు బాగు చేస్తారు?
* స్పీకర్‌ను నిలదీసిన దల్లిపేట గ్రామస్తులు
* అన్నీ పరిష్కరిస్తా...అందుకే మీ వద్దకు వచ్చా : తమ్మినేని
ప్రజాశక్తి - పొందూరు: 
కొండను మింగేస్తున్నా పట్టించుకోరా?, గ్రామంలో రోడ్లు, కాలువలు లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని, ఈ సమస్యలకు ఎప్పుడు మోక్షం కలుగుతుందంటూ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాంను దల్లిపేట గ్రామస్తులు ప్రశ్నించారు. మండలంలోని దల్లిపేటలో సర్పంచ్‌ కంబాపు నీలవేణి ఆధ్వర్యాన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. మాజీ సర్పంచ్‌ బడే రఘురాంరెడ్డి ఆధ్వర్యాన గ్రామానికి చెందిన సుమారు వంద మంది స్పీకర్‌ను కలిశారు. గ్రామం సమీపంలోని కొండను కొందరు అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని, దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. గ్రామంలో రోడ్లు, కాలువలు లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామన్నారు. గత ఎన్నికల్లో తామంతా వైసిపికే ఓటు వేశామని కానీ, ఎటువంటి అభివృద్ధి జరగలేదని వాపోయారు. ఇప్పటికైనా గ్రామంలో సమస్యలు పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరారు. దీనిపై స్పీకర్‌ మాట్లాడుతూ గ్రామ సమస్యలు తనకు తెలుసునని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు.
అర్హులందరికీ ఇళ్ల పట్టాలు
మండలంలోని రాపాకలో అర్హులైన లబ్ధిదారులకు అనువైన స్థలాల్లో ఇళ్ల పట్టాలను అందజేయనున్నట్లు స్పీకర్‌ తెలిపారు. ఈమేరకు రాపాకలో 30 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంజూరు చేశామన్నారు. కానీ, ఆ స్థలం కొండ ప్రాంతం కావడంతో తాగునీటి సమస్య ఉంటుందని భావించి ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు ముందుకు రాలేదని స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారందరికీ అనువైన ఇతర ప్రాంతంలో ఇళ్ల పట్టాలను అందజేస్తామన్నారు. జలజీవన్‌ మిషన్‌లో రాపాకలో రూ.మూడు కోట్లతో, తోలాపిలో రూ.1.60 కోట్లతో, తాడివలసలో రూ.1.40 కోట్లతో ఇంటింటా కుళాయిలు ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి లోలుగు కాంతారావు, ఎంపిపి ప్రతినిధి కిల్లి నాగేశ్వరరావు, వైసిపి మండల అధ్యక్షులు పప్పల రమేష్‌కుమార్‌, పిఎసిఎస్‌ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, కంబాపు సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.