
పెట్రోలు, డీజిల్‌పై మోడీ ప్రభుత్వ నామమాత్రపు ఎక్సైజ్ సుంకం తగ్గింపు కొండను కబళించి ఇసుక రేణువు వదిలిపెట్టిన చందం. నెల రోజుల వ్యవధిలో పధ్నాలుగు తడవలు ఎడా పెడా పెట్రో ఛార్జీల మోత మోగిపోయింది. రిటైల్ ద్రవ్యోల్బణం 7.79 శాతానికి ఎగబాకి ఎనిమిదేళ్ల రికార్డులు బద్దలు కొట్టింది. టోకు ద్రవ్యోల్బణం 15.08 శాతానికి చేరుకుంది. నిత్యావసర వస్తువుల ధరలు అదుపు తప్పాయి. ప్రజలకు రోజువారీ బతుకు వెళ్లదీయడం అత్యంత దుర్భరంగా తయారైంది. ధరల పెరుగుదలపై జనం ఆగ్రహంగా ఉన్నారు. మరోవైపు ధరల పెరుగుదలపై దేశ వ్యాప్త ఆందోళనలకు వామపక్షాలు పిలుపునిచ్చాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొనే బిజెపి సర్కారు లీటరు పెట్రోలుపై రూ.8, లీటర్ డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ శనివారం నిర్ణయం తీసుకుంది. ఎనిమిదేళ్లుగా, మరీ రెండేళ్లుగా ప్రజలకు పెట్రో ధరల మంట పెట్టి, సమస్త వస్తువుల ధరల పెరుగుదలకు కారణమై, జనం బతుకులను ఛిద్రం చేసి, ఇప్పుడు స్వల్ప తగ్గింపుపై ప్రధాని సహా బిజెపి పెద్దలు లంకించుకున్న ఫీల్‌గుడ్ ప్రచారం గిల్లి జోల పాడటం వంటిది. ఉజ్వల్ పథకం కింద వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.200 రాయితీ మొత్తం గ్యాస్ వినియోగదారుల్లో మహా అయితే 20 శాతానికే లభిస్తుంది. తతిమ్మా 80 శాతం కుటుంబాలూ ఇబ్బడిముబ్బడిగా వేసిన ధరల భారం మోయాల్సిందే.
కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చే నాటికి లీటర్ పెట్రోలుపై ఎక్సైజ్ పన్ను రూ.9.20 ఉండగా అది కాస్తా 32.90 అయింది. 194 శాతం పెరిగింది. లీటర్ డీజిల్‌పై పన్ను రూ.3.46 నుండి 31.80కి ఎగబాకింది. మోడీ జమానాలో 585 శాతం పెరిగింది. ఇవి కాకుండా సెస్సులు, సర్‌ఛార్జీలు, ప్రత్యేక పన్నులు ఉండనే ఉన్నాయి. కోవిడ్ ఆపత్కాలంలోనూ పన్నుల మోత ఆపలేదు. వీటన్నింటినీ ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా భరిస్తున్నారు. కేంద్రం రూ.లక్షలాది కోట్ల అదనపు ఆదాయం పోగేసుకుంది. ఈ వాస్తవాలను మరుగునపర్చి నిరుడు నవంబర్‌లో పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై 10 తగ్గించామని, ఇప్పుడూ కొంత తగ్గించామని, అదే తాము జనానికి చేసే పెద్ద ఉపకారమని బిజెపి నేతలు వల్లె వేస్తున్నారు. రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ మధ్యనే సి.ఎం లతో ఆన్‌లైన్ మీటింగ్‌లో ప్రధాని ఈ ప్రతిపాదన చేసినప్పుడు విపక్ష రాష్ట్రాలు వ్యతిరేకించాయి. సెస్సులు, సర్‌ఛార్జీల రూపంలో లక్షల కోట్లు మూటగట్టుకుంటున్న కేంద్రం వాటిలో రాష్ట్రాలకు వాటా ఇవ్వట్లేదు. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఇవ్వాల్సిన జిఎస్‌టి బకాయిలు చెల్లించట్లేదు. తిరిగి పెట్రో పన్నులు తగ్గించమనడం రాష్ట్రాల హక్కుల్లోకి జొరబడటమే. రాష్ట్రాలను పన్నులు తగ్గించమనే ముందు తాను 2014 స్థాయికి పన్నులు తగ్గించినట్లయితే ధరలు తగ్గుతాయి. అంటే పెట్రోలుపై మరో రూ.12.27, డీజిల్‌పై రూ.10.47 తగ్గించాలి. తద్వారా ప్రజలకు ఉపశమనం కలుగుతుంది.
ఒక వైపు కరోనా మరోవైపు కేంద్ర నిధుల ఎగవేతలతో ఆదాయం కోల్పోయినప్పటికీ కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు పెట్రో పన్నులు తగ్గించాయి. ఎక్సైజ్ సుంకం తగ్గింపుపై తాజాగా కేంద్ర ప్రకటన వచ్చిన వెంటనే కేరళ ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం పెట్రోలుపై రూ.2.41, డీజిల్ రూ.1.36 తగ్గిస్తున్నట్లు తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వం సైతం కొంత తగ్గిస్తామంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వ్యాట్ తగ్గించాలి. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా చమురు ధరలు పెరుగుతాయన్న వాదనలో అంతగా పస లేదు. దేశంలో ఇంతకు ముందు పెట్రోలు, డీజిల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఉండేది. నయా-ఉదారవాద విధానాల్లో భాగంగా యుపిఎ-2 ప్రభుత్వం పెట్రోలు ధరలపై నియంత్రణ ఎత్తేయగా, ఎన్‌డిఎ సర్కారు డీజిల్ రేట్లపై నియంత్రణ ఎత్తేసింది. దాంతో రోజువారీ ధరల విధానం వచ్చింది. ధరలపై ప్రభుత్వ నియంత్రణ, పన్నుల తగ్గింపు, చమురుపై అంబానీ, అదానీల ఆధిపత్యానికి ముకుతాడు, దేశీయంగా ప్రభుత్వ రంగంలో చమురు ఉత్పత్తి పెంపు ఇవే ప్రత్యామ్నాయాలు. ప్రత్యామ్నాయాలతోనే ధరలు తగ్గుతాయి. కంటి తుడుపు చర్యలతో కాదు. ప్రత్యామ్నాయ విధానాల కోసం ప్రజలు ఉద్యమించి మోడీ ప్రభుత్వ మెడలు వంచాలి.