
ప్రజాశక్తి-కురుపాం : కొండగెడ్డ వద్ద చెక్‌డ్యాం నిర్మాణం చేపట్టాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలో గుజ్జువాయి పంచాయతీలోని డి.బారామణి, సవరగూడ, ఎర్రగడ్డ, భారామని కాలనీ గ్రామాల్లో గిరిజనులు సాగు చేస్తున్న పంట పొలాలను సిపిఎం నాయకులు వి.వాసు, అంగధతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రామాల్లో సరైన నీటి సదుపాయం లేక 600 ఎకరాల వరకు ఎడారిగా మారిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. దాదాపు ఐదారేళ్ల నుంచి గిరిజనులు కరువుతో అల్లాడిపోతున్నారని వాపోయారు. ఇక్కడ చెక్‌డ్యామ్ నిర్మాణం చేపట్టి గిరిజన రైతాంగానికి నీరందించే ప్రయత్నం చేయకపోవడం బాధాకరమన్నారు. ఈ ప్రాంతంలో కొండవాగుల నుంచి వచ్చిన వరదనీటిని కొండగెడ్డ వద్ద చెక్‌డ్యామ్ నిర్మిస్తే పొలాలు సాగు చేసుకోవచ్చన్నారు. సోలార్ ద్వారా సాగునీరు అందించేందుకు ప్రయత్నం చేస్తామని డీడీలు కూడా తీయించుకుని, పట్టించుకోకుండా వదిలేశారని అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి చెక్‌డ్యామ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొండగొర్రె వైకుంఠరావు, ఆరిక శ్రీనివాసరావు, కృష్ణారావు, ఆరిక సాంబయ్య, ఆరిక రామారావు, తాడింగి వెంకట్రావు, లక్ష్మయ్య, మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.