ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : కూరగాయల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గత 15 రోజుల్లో ప్రతి వెరైటీ కిలోకు రూ.5 నుంచి రూ.20 వరకు పెరిగాయి. రైతు బజార్లలో ఉన్న ధరలకు మార్కెట్‌లో ఉన్న ధరలకు కిలో రూ.10 నుంచి 20 వరకు తేడా ఉంటోంది. దీంతో ఎక్కువ మంది రైతు బజార్లను ఆశ్రయిస్తున్నారు. కొన్ని రకాల కూరగాయాలు రైతు బజార్లలో కన్పించడం లేదు. సరఫరా తగ్గిందంటున్నారు. అరకొర వసతులతో రైతు బజార్లలో వేసవి తీవ్రతను కూరగాయలు నాణ్యత మరింత తగ్గుతోంది.
వివిధ రైతు బజార్లలో టమోటా కిలో రూ.38కు చేరింది. బహిరంగ మార్కెట్‌లో రూ.50కు అమ్ముతున్నారు. రైతు బజార్లలో ఆదివారం క్యారెట్ ధర రూ.49, పచ్చిమిర్చి రూ.83, కాకర రూ.34, బీర రూ.40, క్లాలిఫ్లవర్ రూ.80, క్యాబేజి రూ.19, దొండ రూ.22, బంగాళదుంపలు రూ.22, గోరుచిక్కుడు రూ.38, ఉల్లిపాయలు రూ.18, దోసకాయ రూ.15, పొట్ల రూ.15, సొర రూ.25, బీట్ రూట్ రూ.34కు విక్రయించారు. బోర్డు ధరల కంటే కొంత మంది వ్యాపారులు కిలోకి రూ.2 నుంచి రూ.5 వరకు అదనంగా విక్రయిస్తున్నా మార్కెటింగ్ శాఖ అధికారులు నియంత్రించడం లేదు. ఆకు కూరలు కట్ట రూ.15 నుంచి రూ.20 వరకు పలుకుతున్నాయి. రైతు బజార్లలో రైతుల సంఖ్య క్రమంగా తగ్గిపోయి వ్యాపారులసంఖ్య పెరుగుతోంది. రైతు బజార్లలో కిలో దొండ కాయరూ.22కు విక్రయిస్తున్నా నారా కోడూరులో రైతులకు మాత్రం కిలో రూ.10 కూడా దక్కడం లేదు. బెండకాయ కిలో రూ.8, వంకాయలు రూ.8లు మాత్రమే లభిస్తుంది.
కొద్దిమంది రైతులు మాత్రం రైతు బజారుకు వచ్చి విక్రయిస్తున్నారు. అయితే రవాణా ఖర్చులు అధికం కావడం వల్ల పొలం దగ్గర అమ్ముకున్నా రైతు బజారులో అమ్ముకున్నా దక్కెది కూలిపాటేనని వివిధ గ్రామాల నుంచి వచ్చి రైతు బజార్లలో కూరగాయలు విక్రయిస్తున్న రైతులు వాపోతున్నారు. క్యాప్సికమ్, క్యారెట్, బిట్రూట్ తప్ప మిగతా కూరగాయలన్నీ ఎక్కువగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సరఫరా అవుతున్నాయి. గత 40 రోజులుగా వర్షాలు లేకపోవడం, ఎండల తీవ్రత కావడంతో కూరగాయల తోటలు దెబ్బతింటున్నాయి. గతనెలలో కురిసిన అకాల వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో కూరగాయల తోటలు దెబ్బతినడంతో ఉత్పత్తి తగ్గి ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అంతేగాక రవాణా ఖర్చుల భారం ఎక్కువగా ఉందంటున్నారు.
పల్నాడు జిల్లా యడ్లపాడు, అమరావతి, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, గుంటూరు రూరల్, చేబ్రోలు, తాడేపల్లి, మంగళగిరి తదితర ప్రాంతాల్లో కూరగాయల తోటలు ఎక్కువగా ఉన్నాయి. నీటి ఎద్దడి పెరగడం, కాల్వల ద్వారా నీరు రాకపోవడం వల్ల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రైతు బజార్లకు నాణ్యతలేని సరుకు ఎక్కువగా వస్తోంది. జిల్లాలో 30 వేల ఎకరాల్లో కూరగాయల సాగు జరుగుతోంది. రవాణా ఛార్జీలు పెరిగిన నేపథ్యంలో ఒక ప్రాంతంనుంచి మరో ప్రాంతానికి రవాణా చేయడం కష్టంగా ఉందని అందువల్ల ఏ ప్రాంతంలోని వ్యాపారులు ఆ ప్రాంతంలోని ఉత్పత్తి అయిన కూరలు కొంటున్నారు. వివిధ గ్రామాల్లో జరిగే సంతల్లో ధరలు కూడా భారీగానే ఉంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కూరగాయల ధరలు ఎక్కువగానే ఉంటున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఉన్న ధరలను తెలుసుకుని గ్రామాల్లో ధరలు పెంచుతున్నారు.










