Jun 27,2023 21:18

కొండెక్కిన కూరగాయల ధరలు

పచ్చి మిర్చి ముట్టుకుంటే ఘాటెక్కుతోంది.. టమోటా ఒక్కసారి ఆకాశంలో ఎక్కి కూర్చుంది.. మేమేం తక్కువా అన్నట్లు అన్ని కూరగాయల ధరలు వాటి వెంటే కొండెక్కి కూర్చున్నాయి.. 15 రోజుల క్రితం ఉన్న ధరలతో పోల్చుకుంటే ప్రస్తుతం డబుల్‌ అవడంతో సామాన్య ప్రజలు వామ్మో అంటున్నారు.. మార్కెట్‌కు ఐదు వందల నోటుతో వెళితే... సగం బస్తా కూడా నిండడం లేదని ప్రజలు వాపోతున్నారు. మిర్చి ధర మార్కెట్‌లో రూ.100, కాకర రూ.50కి చేరింది. టమోటా రూ.60 నుంచి 80 మధ్యలో ఉంది. ప్రతి వస్తువు ధర పెరిగి ప్రజలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. కూరగాయల సాగు తగ్గిపోవడం, ఎండివేడిమితో తోటలు దెబ్బతినడం వల్ల ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. మార్కెట్‌కు ఎక్కువగా దిగుబడులు వస్తే ధరలు అదుపులోకి వస్తాయని వ్యాపారులు చెబుతున్నారు.ప్రజాశక్తి-రాయచోటి
సామాన్య, మధ్యతరగతి కుటుంబాల్లో కూరగాయలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. వారి వంటింట్లో ఉడకనంటూ భీష్మించుకున్నాయి. సామాన్యుడు రూ.500 తీసుకుని మార్కెట్టుకు వెళ్తే పట్టుమని నాలుగు రకాల కూరగాయలు కొనలేని పరిస్థితి నెలకొంది. మార్కెట్‌లో టమోటాను పట్టుకుంటే దాని ధర ఠారెత్తిస్తోంది. పచ్చిమిర్చి ధర ఘాటెక్కి తనను ముట్టుకోవద్దంటోంది. ఇలా ప్రతి కూరగాయీ సామాన్యుడిని ముట్టుకోనీయడం లేదు. ఎందుకంటే వాటి ధరలు అంత అమాంతంగా పెరిగి ఆకాశానికి నిచ్చనేశాయి. కనీసం పచ్చడి మెతుకులు తిందామనుకుంటే పచ్చిమిర్చి ధర రూ.100 చేరి అందనంత ఎత్తులో ఉంది. అన్నమయ్య జిల్లాలో ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గంలో దేవపట్ల, సంబేపల్లి, చిన్నమండెం, మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లి ప్రాంతాల్లో టమోటాల సాగు అధికంగా ఉంది. నెల కిందట రైతులకు గిట్టుబాటు ధరలు లేక టమోటాలను రోడ్లపైనే పారే వేసి వెళ్లేవారు. ఇటీవల టమోటా ధర బాగా పెరగడంతో ఇదే అదునుగా దళారీలు సొమ్ము చేసుకుంటూ అధిక ధరలకు విక్రయించడం మొదలుపెట్టారు .ఇదేమిటి అంటే కూరగాయల సాగు తగ్గిందని ధరలు పెరిగాయి అంటూ చెప్పి సామాన్యులను దోపిడీ చేస్తున్నారు. గతంలో కిలో టమోటా ధర రూ.5, 10 ఉండగా నేడు ఏకంగా రూ. 60 నుండి రూ.80 వరకు చేరింది. నిత్యం వంటకాల్లో టమోటా అవసరం తప్పదు కాబట్టి ఎంత ధర పెట్టి అయినా కొనుగోలు చేస్తున్నారు. వంకాయలు గతంలో కిలో రూ.30 నుండి రూ.40 ఉండగా నేడు అమాంతంగా రూ.60 నుంచి రూ.80, మునగ రూ.100 విక్రయిస్తున్నారు. నిత్యం కూరల్లో ఉపయోగించే ఉల్లిపాయలు కూడా గతంలో రూ.15 ఉండగా నేడు ఒక్కసారిగా రూ.40కు మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. వీధి దుకాణాల్లో కిలో రూ.50 చొప్పున అమ్ముతున్నారు. బీరకాయలు ధరలు కూడా సామాన్యుడికి అందుబాటులో లేకున్నాయి. ఇక పచ్చిమిరపకాయల మాట ఎత్తుకుంటే కిలో రూ.వంద చొప్పున అమ్మకం సాగిస్తున్నారు . ఇదేమిటి అంటే ఈసారి పంట తక్కువగా ఉందని, గిరాకీ బాగా పెరిగిందని దుకాణదారులు చెప్పడం గమనార్హం. ఇక ఆకుకూరల ఆరోగ్యానికి ఎంతో మంచివని వైద్యులు చెప్పడంతో వాటి ధరలు సైతం ప్రస్తుతం మార్కెట్‌లో అమాంతంగా పెరిగాయి. ఏ ఆకు కూరను తీసుకున్నా రూ.10 ఉంది. ముఖ్యంగా మెంతి ఆకు, పాలకు, చుక్కాకు, గోంగూర, చింతాకు వంటివి కూడా అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక ఆదివారం వస్తే మాంసంలోకి కచ్చితంగా వాడే పుదీనా, కొత్తిమీర, అల్లం వంటివి కూడా ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు కొనాలింటే ఆందోళనకు గురవుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ధరల నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇది ఇలా ఉంటే రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో ధరలను నియంత్రించాల్సిన అధికారులు ఏ ఒక్కరూ రైతు మార్కెట్‌ వైపు చూసిన పాపాన పోలేదు. కూరగాల తూకాల్లోనూ మోసం చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధితాధికారులు రైతు బజార్లలో, మార్కెట్లలో సందర్శించి కూరగాయల ధరలు తగ్గించాలని పలువురు కోరుతున్నారు.
ధరలు నియంత్రించాలి
మార్కెట్‌లోకి కూరగాయలు కొనడానికి వెళ్లాలంటే భయమేస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా కూర గాయల ధరలను పెంచేశారు. మార్కెట్లకు వెళ్తే ఏ కూరగాయలు కొని తినే పరిస్థితు లలో లేం. అధికారులు స్పందించి కూరగా యల ధరలు వెంటనే నియంత్రించాలి.
- నాగసుధ, గృహిణి, రాయచోటి .
వ్యాపారులు దోచుకుంటున్నారు
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ విపరీతంగా రేట్లను పెంచడంతో రవాణా ద్వారా ట్రాన్స్‌పోర్టు ద్వారా నిత్యావసర, కూరగాయలు రేట్లు అధికమయ్యాయి. దీని వల్ల రైతుల కంటే దళారులు ఎక్కువ ఫలితం పొందుతున్నారు. రైతులు, వినియోగదారులు నష్టపోతున్నారు.
- పి.శ్రీనివాసులు, సిపిఎం జిల్లా కార్యదర్శి,
అన్నమయ్య.