ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ప్రస్తుతం కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఈ ధరలతో సామాన్యుని వంటింటి బడ్జెట్ నాలుగింతలు పెరిగింది. టమోటా, పచ్చిమిర్చి ధరలు రూ.100 దాటాయి.
ధరల స్థిరీకరణ చట్టం తీసుకొచ్చి రైతులకు, వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తామని అటు బిజెపి, కాంగ్రెస్, టిడిపి, వైసిపి నాయకులు ఎన్నికల ముందు ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు. పాదయాత్రల్లో విచ్చలవిడి వాగ్దానాలు చేస్తూ అధికారంలో వచ్చిన తర్వాత తమకేమీ పట్టనట్టు ముందుకు పోతున్నారని విమర్శలు వస్తున్నాయి. మామూలుగా ప్రతేడాది వేసవిలో కూరగాయల ధరలు పెరగడం పరిపాటి. ఈఏడాది ధరలు నాలుగింతలు పెరగడంతో సామాన్యుని వంటింటి బడ్జెట్ నాలుగింతలు పెరిగింది. కూరగాయల సాగుపై రైతులకు అవగాహన లేకపోవడం, వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే రైతులకు వేసవిలో కూరగాయల సాగుకు విత్తన, ఎరువుల రాయితీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో కూరగాయల సాగు లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడంతో ధరలు పెరగడం ఒక కారణం. ఈ దుస్థితి ఆగస్టు చివరి వరకు ఉండవచ్చని పలువురు అంచనా వేస్తున్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని నందమూరి తారక రామారావు కూరగాయల మార్కెట్‌లో పచ్చిమిర్చి రూ.130, టమోటా రూ.120 పలికింది. అలాగే క్యాలీఫ్లవర్ రూ.80, బీరకాయ రూ.70, బెండకాయ రూ.60, కాకరకాయ రూ.70, సోరకాయ రూ.60, చోళకాయ రూ.60, బీన్స్ రూ.80, చిక్కుడు రూ.80, దొండకాయ రూ.70, ఆలుగడ్డ రూ.50, ముల్లంగి రూ.60, వంకాయ రూ.60, దోసకాయ రూ.60 పలికింది. అలాగే కొత్తిమీర చిన్న కట్ట రూ.20, పాలకూర రూ.10, మెంతికూర రూ.20, గోంగూర రూ.15 కూరగాయలకు పోటీగా ఆకుకూరలు కూడా పెరిగాయి. ధరలు ఇలా పెరగడంతో సమతుల్య ఆహారానికి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని సబ్సిడీపై కూరగాయలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.
దుకాణంలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న కూరగాయలు










