Jun 09,2023 23:58

కోడి

ప్రజాశక్తి-మాడుగుల:సామాన్యులకు అందుబాటు లో లేని విధంగా కోడి మాంసం ధరలు అమాంతంగా పెరిగాయి. చాలా కాలం తరువాత ఊహించని విధంగా కోడి ధర కొండెక్కింది. ప్రస్తుతం బ్రాయిలర్‌ కోడి మాంసం కిలో రూ.300 దాటింది. లైవ్‌ ధర రూ.175లకు చేరింది. చాలా కాలం తరువాత ఇంత భారీ స్థాయిలో ధరలు పెరగడం ఇదే మొదటిసారి. దీంతో, సామాన్యులు కోడి మాంసం తినే పరిస్థితి కరవు అయ్యింది. సుమారు ఐదు నెలల కిందట కోడి ధరలు అమాంతం పడిపోయాయి. 100 రూపాయల లోపే కిలో లైవ్‌ ధర వుండేది. దీంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోయి లబో దిబో మన్నారు. స్వంతంగా కోళ్లను పెంచి విక్రయించే రైతులు లక్షల్లో నష్ట పోయారు. కంపెనీల ద్వారా పౌల్ట్రీ లు నడిపే రైతులు సైతం రేట్‌ ఇన్సెంటివ్‌ లేక నష్ట పోవలసి వచ్చింది. అప్పట్లో పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. కార్తీక మాసంలో అనేక మంది నాన్‌ వెజ్‌ తినరు. ఆ సమయంలో కోడి మాంసం ధరలు కొంచం తక్కువగా వుండడం సహజం. కార్తీక మాసంలో వున్న ధరలు కంటె, ఆ తరువాత ధరలు ఇంకా తగ్గడం వెనుక పౌల్ట్రీ కార్పొరేట్‌ శక్తులు మాయాజాలమే అని పౌల్ట్రీ రైతులు అవేదన చెందారు. ప్రస్తుత ధరలు బట్టి రైతులకు మంచి లాభాలు రావడం సహజమే అయినా, ఇంత భారీ స్థాయిలో కోడి ధర పెరగడం అనూహ్య మే. పెరిగిన భారీ ధరలతో సామాన్యులకు ఆర్ధిక భారం తప్పదు. వివాహాలు, ఇతర కార్యక్రమాల్లో నాన్‌ వెజ్‌ ఏర్పాటు చేసేవారికి మాత్రం అదనపు భారం తప్పదు.