May 20,2022 06:32

చికెన్‌ రేట్లు పెరగడంతో కొనలేక, తినలేక అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఎక్కువ వాడకం ఉన్న స్కిన్‌లెస్‌ చికెన్‌ గత నెల వరకూ రూ. 180 దాకా ఉండగా ఇప్పుడది రూ. 300 దాటేసింది. స్కిన్‌ చికెన్‌ రూ. 160 నుంచి 250కు చేరగా, లైవ్‌ కోడి దాదాపుగా రూ. 200 అయింది. ఇక ధరల మంటపై పలు విశ్లేషణలున్నాయి. గత 3 నెలల్లో చలికి తోడు వాతావరణ పరిస్థితులు అనుకూలించక కోళ్లు బరువు పెరగడం లేదని, కొన్ని వ్యాధులతో చనిపోతున్నాయని పౌల్ట్రీ వర్గాలు వివరిస్తున్నాయి. ఎండ వేడికి వేసవిలో కోళ్లు చనిపోతాయి. అందుకే కోళ్లు బలిష్టంగా తయారుకాక మునుపే రైతులు అమ్మేస్తారు. దాంతో సమ్మర్‌లో చికెన్‌ రేట్లు తగ్గుతాయి. అయితే ఈ సీజన్‌లో చికెన్‌ రేట్లు అమాంతం పెరిగాయి. ఇది అనూహ్య పరిణామమని పౌల్ట్రీ నిపుణులు విశదీకరిస్తున్నారు. ఉత్పత్తి మందగించి సరఫరా తగ్గటంతో చికెన్‌ ధరలు పెరిగాయని వారంటున్నారు. మామూలుగా రైతులు ఏడాదికి ఆరు బ్యాచ్‌ల బ్రాయిలర్‌ కోళ్లను ఉత్పత్తి చేయాల్సి ఉండగా, ప్రస్తుతం 4 బ్యాచులనే తీస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఒక్కో బ్యాచ్‌ ఎదగటానికి 45 రోజులు పడుతుంది. బ్యాచ్‌కు బ్యాచ్‌కు మధ్య 15 రోజులు వ్యవధి ఉంటుంది. కానీ ప్రస్తుతం కంపెనీలు ఈ వ్యవధిని 45 రోజుల నుంచి 50 రోజులకు పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఏటా ఫిబ్రవరి నుంచి మే నెల దాకా కంపెనీలు ఇలానే చేస్తాయని రైతులు చెప్పటం గమనార్హం.
బ్రాయిలర్‌ కోళ్లకు ముఖ్యంగా మొక్కజొన్న, సోయాబీన్‌ ఆహారంగా ఇస్తుంటారు. యుద్ధం రావడంతో ఉక్రెయిన్‌ నుంచి మొక్కజొన్న, సోయాబీన్‌ ఎగుమతులు ఆగిపోయాయి. దీంతో పలు దేశాలు భారత్‌ను ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో సోయా, మొక్కజొన్నకు భారీ డిమాండ్‌ వచ్చింది. ఇప్పుడే భారత్‌ నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు మొదలయ్యాయి. తద్వారా ధరలు పెరిగిపోవడంతో చికెన్‌ ధరలు ఎగబాకాయని హేచరీస్‌ నిపుణులు వివరిస్తున్నారు.
కరోనా సమయంలో పౌష్టికాహారానికి ప్రాధాన్యతనివ్వాలని వైద్యులు పదేపదే సూచనలు ఇవ్వడం... ఇమ్మూనిటీ పెరిగేందుకు చికెన్‌, ఇతర మాంసకృతులు దోహదం చేస్తాయని ఆరోగ్య సూత్రాలు వెల్లువెత్తడంతో జనం అటువైపు ఆసక్తి చూపారు. పైగా మటన్‌ ధరలు ఎక్కువవ్వడంతో చికెన్‌ పట్ల మొగ్గు చూపుతున్నారు. కొన్నాళ్ళ పాటు ఇవే ధరలు కొనసాగుతాయని, ఈ నెల మూడవ వారం నుంచి తగ్గుతాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఉత్పత్తి వ్యయం ఎక్కువయిందని అందుకే కొత్తగా కోడి పిల్లలను పెంచడం లేదని వ్యాపారులు ముక్తాయిస్తున్నారు.
గాలిలో తేమ శాతం తగ్గడం, వర్షాలు లేకపోవడంతో వాతావరణం వేడెక్కింది. కోళ్ళ ఎదుగుదలపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. మేత తక్కువగా తిని, ఎక్కువగా నీళ్ళపై ఆధారపడడంతో కోళ్ళు అనుకున్నంత బరువు పెరగడం లేదు. కోళ్ళ పరిశ్రమలో 80 నుంచి 85 శాతం వాటా కంపెనీలదేనని, మిగిలిన 15-20 శాతమే రైతులున్నారని చెబుతున్నారు. రైతులు కోళ్ళు పెంచి కంపెనీలకు అందజేస్తుంటారు. కోళ్ళ ధరలు నిర్ణయంలో కంపెనీలదే కీలక భూమిక కావడంతో, మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా రేట్లు పెంచుతున్నారని కొందరు రైతులు వివరిస్తున్నారు.
 

- చెన్నుపాటి రామారావు,
సెల్‌ : 99590 21483