ప్రజాశక్తి:అరకులోయ రూరల్:మండలంలోని మాదల పంచాయతీ మారుమూల గ్రామాలైన దాబుగుడ, దోమలజోరు, రక్తకండి గ్రామాలకు పూర్తి స్ధాయిలో రోడ్డు సదుపాయం లేక పోవడంతో పది కిలో మీటర్లు దూరంలో ఓ కొండ పైన మధ్య మార్గంలో బియ్యం పంపిణి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గిరిజనులు స్వంత పనులు వదిలేసి అష్ట కష్టాలు పడి కొండకు నడుచుకొని వచ్చి ఎండలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్డు సదుపాయం కల్పించకుండా మారుమూల పంచాయతీ గ్రామాలకు ఇంటింటికి డోర్ డెలివరీ బియ్యం పంపిణి ఎలా సాధ్యం అవుతుందని గిరిజనులు మండిపడుతున్నారు. గిరిజన గ్రామ్లాలో ఎక్కడ కూడా డోర్ డెలివరీ జరగ లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా దాబుగుడ, దోమలజోరు, రక్తకండి గ్రామాలకు 2014లో రోడ్డు మంజూరు మంజూరు అయ్యింది. నేటికీ పూర్తి కాలేదు. గిరిజనులు ఎవరికైనా ఆరోగ్యం బాగోలేనప్పుడు డోలీ మోత తప్ప మరో మార్గం లేదు. గిరిజనులపై చిత్తశుద్ధి ఉంటే ముందు రోడ్డు మార్గం పూర్తి చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు.స్ధానిక ఎమ్మెల్యే శెట్టి పాల్గుణ ఇటీవల కాలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజనులు, గిరిజన సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఇప్పటికైనా రోడ్డు మార్గం పూర్తి చేసి ఇంటింటికి బియ్యం పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.










