ప్రజాశక్తి -సీలేరు
ఆదివాసీలు నాటువైద్యానికి దూరంగా ఉండాలని జికె.వీధి మండలం దారకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి హిమబిందు పిలుపునిచ్చారు. మండలంలోని గుమ్మరేవుల పంచాయతీ కొండ జర్త గ్రామంలో శుక్రవారం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్ హిమబిందు 79 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. గిరిజనుల ఇళ్లను సందర్శించి వారి ఆరోగ్య స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. దీనికి ముందు దారకొండ పిహెచ్‌సి నుంచి వైద్య సిబ్బంది నేలజాతర వరకు వాహనంలో వచ్చి అక్కడ నుంచి కాలినడకన కొండ జర్త చేరుకున్నారు. ఈ సందర్భంగా వైద్యాధికారి హిమబిందు మాట్లాడుతూ వ్యాధి ప్రబలిన వెంటనే ఏఎన్‌ఎంలనుగాని, హెల్త్ సూపర్వైజర్‌ను గానీ సంప్రదించి ప్రాథమిక చికిత్స పొందాలని సూచించారు. వ్యాధి నయం కాకపోతే ఆసుపత్రికి వచ్చి మెరుగైన వైద్య సేవలు పొందాలన్నారు. పసరు మందులు, నాటు మందులు వేయడం వల్ల వ్యాధి తీవ్రత మరింత అధికమవుతుందని, ప్రాణాలకే ముప్పు కలగవచ్చునని పేర్కొన్నారు. గర్భిణులు క్రమం తప్పకుండా ఆసుపత్రికి వచ్చి తనిఖీలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌ఎన్ రాణి, హెల్త్ సూపర్వైజర్ పోతురాజు, ఎంఎల్‌హెచ్ పి.కుమారి, హెల్త్ అసిస్టెంట్ అప్పారావు, ఫార్మసిస్టు మూర్తి, ఏఎన్‌ఎంలు మత్స్య కొండ సీత తదితరులు పాల్గొన్నారు.










