- నాలుగు కిలోమీటర్లు కాలినడకన వెళ్లిన జెసి
- గిరిజనుల సమస్యల పరిష్కారానికి హామీ
ప్రజాశక్తి - మెళియాపుట్టి : రేషన్ సరుకులు అందక మండలంలోని కేరాసింగి గ్రామానికి చెందిన గిరిజనులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు మంగళవారం కొండ ఎక్కారు. రహదారి సౌకర్యం లేని కొండపై ఉన్న ఆ గ్రామాన్ని చేరుకునేందుకు నాలుగు కిలోమీటర్లు కాలినకడన వెళ్లారు. గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రహదారి సౌకర్యం లేక రేషన్ కోసం ఇబ్బందులు పడుతుండడాన్ని గమనించిన ఆయన, ట్రాక్టర్ ద్వారా కొండపై ఉన్న గిరిజన గ్రామాలకు సరుకులను అందించాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు కురుస్తున్న కారణంగా మూడు నెలలకు సంబంధించిన రేషన్ ఒకే నెలకు ఇవ్వాలని సూచించారు. కొండపైన మినీ గొడౌన్‌ను ఏర్పాటు చేసి, గిరిజనులకు అవసరమైన రేషన్ బియ్యం వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రహదారి సమస్యపై పట్టించుకునే వారు లేరని జెసి ఎదుట గిరిజనులు వాపోయారు. ఏటా వర్షాలు వచ్చే సమయంలో రోడ్డు పనులు ప్రారంభించి బిల్లులు చేసుకుంటున్నారని, రోడ్డు మాత్రం వేయడం లేదని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇకపై అటువంటి పరిస్థితి ఉండదని జెసి చెప్పారు. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని రహదారి పూర్తయ్యే వరకు విడిచిపెట్టేది లేదని భరోసానిచ్చారు. ఐటిడిఎ పిఒతో మాట్లాడి రహదారి పనులు వేగవంతం చేస్తామన్నారు. నెట్‌వర్క్ లేకపోవడంతో బయోమెట్రిక్‌కు ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు చెప్పారు. బిఎస్‌ఎన్‌ఎల్ టవర్లు మంజూరయ్యాయని... రెండు, మూడు నెలల్లో ఆ సమస్య కూడా పరిష్కరిస్తామని హామీనిచ్చారు. గ్రామంలో రెండు బావులున్నాయని, ప్లాట్‌ఫారం సరిగ్గా లేకపోవడంతో కలుషిత నీరే తాగుతున్నామని గిరిజనులు చెప్పగా, కలెక్టర్‌తో మాట్లాడి ప్లాట్‌ఫారం నిర్మిస్తామన్నారు. అధ్వానంగా ఉన్న పాఠశాలను చూసిన జెసి, నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటరావు, తహశీల్దార్ పి.సరోజని, ఆర్‌ఐ వెంకటరావు, ఎఒ దానకర్ణుడు, విఆర్‌ఒలు, కార్యదర్శులు ఉన్నారు.










