Aug 20,2023 23:30

ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు - చీరాల రోడ్డులో కొమ్మమూరు కాల్వ (మద్రాసు కాల్వ) మీద రూ.42.75 కోట్ల అంచనా విలువతో హైలెవెల్‌ బ్రిడ్జ్‌ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు కిలారు వెంకట రోశయ్య, మహమ్మద్‌ ముస్తఫా, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య మాట్లాడుతూ వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన చేబ్రోలు, కొమ్మమూరు-మద్రాసు కాల్వ బ్రిడ్జ్‌పై నూతనంగా నిర్మించబోతున్న హైలెవెల్‌ బ్రిడ్జ్‌కి శంకుస్థాపన సంతోషంగా వుందన్నారు. ఈ బ్రిడ్జ్‌ నిర్మాణం వల్ల బాపట్ల, రేపల్లె వైపు వెళ్లే ప్రయాణం చాలా సులువుగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బి ఎగ్జీక్యూటివ్‌ ఇంజినీర్‌ సమర్పణరావు, డిఇ నాగేశ్వరరావు, ఏఈ రాంబాబు, వైసిపి నియోజకవర్గ పరిశీల కులు ఎ.సదాశివరావు, జి.అంజిరెడ్డి, జెడ్‌పిటి సిలు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.