రాష్ట్ర ప్రభుత్వ హామీలు నెరవేర్చాలి : సిపిఎం
ప్రజాశక్తి - ఏలూరు
కొల్లేరును ఐదో కాంటూరు నుండి మూడో కాంటూరుకు కుదించాలని, చిత్తడి నేలల చట్టం నుండి మినహాయించాలని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొల్లేరు ఆపరేషన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన కొల్లేరు పేదలు, రైతులు, ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొల్లేరు ముంపు సమస్య పరిష్కారం పేరుతో 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ఆదేశాలతో 'ఆపరేషన్ కొల్లేరు' చేపట్టారని, పేదలకు ప్రభుత్వం ఇచ్చిన సొసైటీలు, డిఫారం పట్టాలు, రైతుల జిరాయితీ భూముల్లో ఉన్న చెరువులను ధ్వంసం చేయడంతో లక్షలాది మంది పేదలు, రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా అనుబంధ పరిశ్రమల్లో ఉన్న వేలాది మంది కార్మికుల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతిందని చెప్పారు. సొంత గ్రామాల్లో ఉపాధి పోవడంతో దూర ప్రాంతాలకు, రాష్ట్రాలకు వలసలు వెళ్లాల్సిన దుస్థితిని ప్రభుత్వమే కల్పించిందని విమర్శించారు. ప్రపంచ బ్యాంకు ఒత్తిడి మేరకు పర్యావరణం పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం 120 జిఒ తీసుకొచ్చి ఉరితాడు సిద్ధం చేస్తే, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 120 జిఒను 'ఆపరేషన్ కొల్లేరు' పేరుతో అమలు చేసి కొల్లేరు ప్రజలను, రైతాంగాన్ని దారుణంగా దెబ్బతీసిందని అన్నారు. ప్రస్తుత వైసిపి ప్రభుత్వం కూడా ఈ సమస్యకు పరిష్కారం చూపకుండా నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. చట్టం పేరుతో ఫారెస్టు అధికారులు కొల్లేరు ప్రజలను, రైతులను కేసులతో ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. 'ఆపరేషన్ కొల్లేరు' తర్వాత ముంపు సమస్య పరిష్కారం కాలేదని, ముంపు మరింత పెరిగిందని, జబ్బు ఒకటైతే ప్రభుత్వం మందు మరొకటి వేసిందని ఎద్దేవా చేశారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో ప్రజల జీవితాలను ఛిద్రం చేసి బహుళజాతి సంస్థల ప్రయోజనాల కోసం తెరవెనుక ఉండి ప్రయత్నాలను చేస్తున్నారన్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా కొల్లేరువాసులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కొల్లేరు కాంటూరు ఐదు నుండి 3కు కుదించాలని, మూడో కాంటూరు లోపల సరస్సును అభివృద్ధి చేయాలని, చిత్తడి నేలల చట్టం నుండి కొల్లేరును పూర్తిగా మినహాయించాలని కోరారు. మిత్రా కమిటీ, శ్రీరామకృష్ణయ్య కమిటీ నివేదికలకు అనుగుణంగా ఛానలైజేషన్ అమలు చేయాలని, ముంపు సమస్య పరిష్కరించాలని, ముంపుపోయేలా సముద్రపు నీరు ఎగదన్నకుండా రెగ్యులేటర్ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి నిధులు మంజూరయ్యాయని, వైసిపి ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కార్యాచరణలో చూపాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. పరిశ్రమల వ్యర్థాలు కొల్లేరులో కలవకుండా అరికట్టాలని, పర్యావరణ పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సొసైటీలు, డి.ఫారం పట్టాలు, జిరాయతీ భూముల్లో సాగును పునరుద్ధరించాలని, నష్టపరిహారం చెల్లించాలని, కాంటూరు 3పైన ఉన్న ప్రభుత్వ భూములు సుమారు 55 వేల ఎకరాలు పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. కొల్లేరు పేదలకు, ప్రజలకు పూర్తిస్థాయిలో ఉపాధి అవకాశాలు, తాగునీరు, విద్య, వైద్య, రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరారు. చేపల వేటకు అవసరమయ్యే ఉపకరణాలు (గెడలు, నావలు, దోనెలు వగైరా) ఉచితంగా అందించాలని కోరారు. ఐదో కాంటూరు లోపల సహా కొల్లేరు ప్రాంతమంతా అనువైన చోట పేదలు, జిరాయతీదారులు వ్యవసాయం చేసుకునేలా అవకాశం ఇవ్వాలని, కేసులు పెట్టరాదని, జిరాయతీ రైతుల హక్కులు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అటవీశాఖ వేధింపులు, కేసులు ఆపాలని, ఎత్తివేయాలని, మత్స్యకారులు, గొర్రెలు, మేకల పెంపకందార్లు ఇతర వృత్తిదారులను ఇబ్బందులకు గురిచేయొద్దని కోరారు. కొల్లేరు ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ఐక్యంగా, ధైర్యంగా ఉద్యమించాలని కోరారు. వారి ఉద్యమాలకు సిపిఎం సంపూర్ణ మద్దతు తెలిపి అండగా ఉంటుందని రవి చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.కిషోర్, జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.










