భారీగా చెరువుల తవ్వకాలకు రంగం సిద్ధం
తాగునీటి అవసరాల పేరుతో అక్రమాలు
రాజకీయ ప్రతినిధుల కనుసన్నల్లో యథేచ్ఛగా తవ్వకాలు..!
ప్రజాశక్తి - మండవల్లి
కొల్లేరును కొల్లగొట్టేందుకు కొందరు బడాబాబులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తాగునీటి అవసరాలను తెరపైకి తెచ్చి కొల్లేరు ఐదో కాంటూరులో వేలాది ఎకరాల్లో చెరువులు తవ్వేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇంగిలంపాకలంక, పెనుమాకలంక, నందిగామలంక, మణుగూరు, పులపర్రు, చెంతపాడు, దయ్యంపాడు గ్రామాల్లో పెద్దఎత్తున చెరువుల తవ్వకానికి తెరలేపుతున్నట్లు తెలిసింది. ఉన్నతన్యాయస్థానం ఆదేశాలను 'కొల్లేరు'లో కలిపేస్తూ రాజకీయ నాయకులే ఈ తతంగమంతా నిర్వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో కొల్లేరులో మళ్లీ ఆక్రమణలు పెరిగిపోయి, కాలుష్య కోరల్లో చిక్కుకుపోవడంతో పాటు గ్రామాలకు గ్రామాలే ముంపుబారిన పడి కొల్లేరు ప్రాంత ప్రజలు వలస బాటపట్టే ప్రమాదం పొంచి ఉంది. ఇదిలా ఉంటే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించైనా కొల్లేరు ఆక్రమణకు గురికాకుండా కాపాడుకుంటామని పర్యావరణ శాస్త్రవేత్తలు, పర్యావరణ ప్రేమికులు స్పష్టం చేస్తున్నారు.
కొల్లేరు ప్రక్షాళన జరిగిందిలా..
కొల్లేరు తాగునీటి సరస్సు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. సుమారు 150 దేశాలకు తలమానికమైన ఈ సరస్సు మండవల్లి మండలంలో ఇంగిలి పాకలంక, నందిగామలంక, పెనుమాకలంక, కొవ్వాడలంక, దయ్యంపాడు, చెంతపాడు, మనుగులూరు, తక్కెళ్లపాడు, పులపర్రు, నిచ్చుమిల్లి, పిల్లిపాడు తదితర గ్రామాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. అప్పటి సిఎం జలగం వెంగళరావు కొల్లేరు ప్రజలకు ఉపాధిని కల్పించేలా చేపల చెరువులను తవ్వించారు. ఇదే అదునుగా బడాబాబులు కొల్లేరుపై కన్నేసి పూర్తిస్థాయిలో ఆక్రమించేశారు. దీంతో కొల్లేరు ప్రజలకు జీవనభృతి లేక సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా ఎగువ ప్రాంతాల్లోని ముంపు నీరు సుమారు 63 డ్రెయిన్ల ద్వారా కొల్లేరులో చేరి ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి చేరకుండా కొల్లేరు ఆక్రమించి తవ్విన చేపల చెరువులు అడ్డుపడేవి. దీంతో డ్రెయిన్లు పొంగి పట్టణాలు, గ్రామాలతో పాటు కొల్లేరు శివారు ప్రాంతాలు జల దిగ్బంధనంలో చిక్కుకుపోయేవి. ప్రధాన పంటలన్నీ మునిగిపోయి రైతులు నష్టపోయేవారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్.రాజశేఖర్‌రెడ్డి కొల్లేరును ప్రక్షాళన చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రజలకు ఉపాధి కలిగేలా కొల్లేరులో చెరువులను ధ్వంసం చేశారు. అనంతరం కొల్లేరును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టినప్పటికీ ఆశించిన మేర ఫలితాలు రాలేదు.
ప్రక్షాళన అనంతరం ఏం జరిగింది..!
కొల్లేరు ఐదో కాంటూరులో ఆక్రమణలను తొలగించి చిత్తడి నేలలను పరిరక్షించే బాధ్యతను అటవీ శాఖ అధికారులకు అప్పగించింది. కొల్లేరులో ఎలాంటి అక్రమణలు జరగకుండా కఠినమైన ఆంక్షలు విధించారు. కానీ కొల్లేరును పరిరక్షించడంలో అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఆంక్షలన్నీ బుట్టదాఖలయ్యాయి. తాగునీటి అవసరాలను సాకుగా చూపి కొల్లేరులో అడ్డూఅదుపూ లేకుండా చేపల చెరువుల తవ్వకాలు చేపట్టారు. ఈ అక్రమాలను గుర్తించి వార్తలు రాసేందుకు వెళ్లిన పత్రికా ప్రతినిధులపైన కూడా దాడులకు తెగబడిన సందర్భాలున్నాయి.
ప్రస్తుత పరిస్థితులు ఇవి..
గత ప్రభుత్వంలోనే కొల్లేరు అన్యాక్రాంతమైందని విమర్శిస్తూనే నేటి ప్రభుత్వ ప్రతినిధులు అదే సాకును చూపిస్తూ గతంలో తవ్విన చెరువులను తలదన్నేలా కొల్లేరులో చేపల చెరువు తవ్వాలనే ప్రధాన లక్ష్యంగా కొందరు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా మనుగడ సాగించేందుకు తాగునీటి అవసరాలసాకుతో మిగిలిన కొల్లేరును ఆక్రమించడానికి ఇక్కడి రాజకీయ నాయకులు వ్వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఈ తవ్వకాలపై వార్తలు రాయకుండా సహకరించాలని కోరుతూ మీడియా ప్రతినిధులను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొల్లేరులో తవ్విన చేపల చెరువు వల్ల కొల్లేటి ప్రాంత ప్రజలకు ఉపాధి లేక వలసబాట పడుతుంటే కొల్లేరు ఆక్రమణదారులు, బడాబాబులు, దళారులు రూ.కోట్లకు పడగలెత్తారనే విమర్శలున్నాయి. ఇదంతా చూస్తుంటే రాజకీయ నాయకులకు ప్రజాసంక్షేమం కన్నా స్వార్థ రాజకీయం కోసం కొల్లేరును బడాబాబులకు కట్టబెట్టడమే ముఖ్య ఉద్దేశంగా ఉన్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. దీనిపై సెక్షన్ ఆఫీసర్ రామ్మోహన్ సింగ్‌ను వివరణ కోరగా చెరువుల తవ్వకాల్లో వాస్తవం లేదని, అన్నీ పుకార్లే అని చెప్పుకొచ్చారు. కొల్లేరులో అలాంటి తవ్వకాలు చేస్తే అడ్డుకుంటామని స్పష్టం చేశారు.










