Nov 04,2022 21:21

రూ.412 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటనలే
మూడుచోట్ల రెగ్యులేటర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు
ఇప్పటికీ కనీసం శంకుస్థాపన చేయని పరిస్థితి
కొల్లేరులోకి ఎగదన్నుతున్న ఉప్పు నీరు
కాగితాలు.. మాటల్లోనే కొల్లేరు పర్యాటక అభివృద్ధి
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

                'కొల్లేరును అభివృద్ధి చేస్తాం.. అక్కడి ప్రజలను ఆదుకుంటాం. కొల్లేరు కలుషితం కాకుండా రెగ్యులేటర్ల నిర్మాణం చేపడతాం' అని ప్రభుత్వం చెబుతున్న మాటలు కాగితాలకే పరిమితమయ్యాయి. కొల్లేరులో అతిముఖ్యమైన రెగ్యులేటర్ల నిర్మాణంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. సముద్రపు ఉప్పునీరు కొల్లేరుకు ఎగదన్నడంతో కొల్లేరు సరస్సు కాలుష్యకారకంగా మారుతోంది. మత్స్య జాతులు సైతం అంతరించిపోతున్నాయి. దీంతో రెగ్యులేటర్ల నిర్మాణంతో ఉప్పునీరు కొల్లేరులోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రణాళికలు తయారు చేశారు. రెగ్యులేటర్ల నిర్మాణం చేపట్టేస్తున్నామంటూ వైసిపి ప్రభుత్వం మూడేళ్లుగా ఊరిస్తూనే ఉంది. ఇప్పటి వరకూ కనీసం శంకుస్థాపన సైతం చేయకపోవడం గమనార్హం. ఆకివీడు మండలం దుంపగడప, మొగల్తూరు మండలం పడితడక, కృష్ణా జిల్లాలోని మోళ్లపర్రు సమీపాన మొత్తం మూడు రెగ్యులేటర్లు నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం రూ.412 కోట్ల నిధులకు సంబంధించి ఉత్తర్వులు సైతం జారీ చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకూ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఈ ఏడాది మే 16న గణపవరంలో జరిగిన బహిరంగ సభలో జగన్‌ మాట్లాడుతూ టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి జూన్‌లో రెగ్యులేటర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. స్వయంగా సిఎం ప్రకటించినప్పటికీ రెగ్యులేటర్ల నిర్మాణం అతీగతీ లేకుండా పోయింది. వైసిపి అధికారంలోకొచ్చి మూడేళ్లు దాటిపోయింది. అయినప్పటికీ రెగ్యులేటర్ల నిర్మాణం మాత్రం కాగితాలకే పరిమితమైంది. కొల్లేరుకు సంబంధించిన ఏ హామీనీ ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదు.
కొల్లేరులో అభివృది ఏదీ..?
కొల్లేరును పర్యాటక రంగంలో అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం నుంచి అధికారుల వరకూ ప్రకటనలు గుప్పించడం మినహా కార్యాచరణ మాత్రం లేకుండాపోయింది. 2006లో 'ఆపరేషన్‌ కొల్లేరు' పేరుతో చేపల చెరువులన్నింటినీ బాంబులు పెట్టి పేల్చేశారు. జిరాయతీ భూముల్లోని చేపల చెరువులను సైతం ధ్వంసం చేసేశారు. ఏఒక్క రైతుకూ పరిహారం మాత్రం ఇవ్వలేదు. అప్పటి నుంచి కొల్లేరు ప్రాంత ప్రజలు వలస పక్షుల్లా మారి బతుకులు నెట్టుకొస్తున్నారు. కొల్లేరును పర్యాటక రంగంలో అభివృద్ధి చేసేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. కేరళ తరహాలో బోటు ప్రయాణాలు వంటి ఏర్పాటు చేయడం, ఆటపాక పక్షుల కేంద్రాన్ని మరింతగా తీర్చిదిద్దడం, రిసార్టులు ఏర్పాటు చేయడం వంటివి చేస్తే కొల్లేరు పర్యాటక రంగంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అది జరిగితే స్థానిక ప్రజానీకానికి ఉపాధి దొరుకుతోంది. ప్రభుత్వం మాటల్లో తప్ప చేతల్లో కొల్లేరును పట్టించుకోని పరిస్థితి నెలకొంది. అదే సమయంలో ధ్వంసం చేసిన జిరాయతీ భూములను అప్పగించాలని, కొల్లేరును మూడో కాంటూరుకు కుదించాలనే డిమాండ్లపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. భూముల రీసర్వే నిర్వహించి కొల్లేరులో జిరాయతీ భూములను అక్కడి ప్రజలకు అప్పగిస్తామని చెబుతున్నప్పటికీ చేతల్లో మాత్రం అడుగు ముందుకు పడటం లేదు. ప్రభుత్వం రీసర్వే నిర్వహిస్తే పది వేల ఎకరాల భూమి రైతులకు అందనున్నట్లు స్థానిక ప్రజానీకం చెబుతున్నారు. రెగ్యుటేర్ల నిర్మాణం నుంచి పర్యాటక అభివృద్ధి, భూముల రీసర్వే ఏ ఒక్కటీ ప్రభుత్వం చేపట్టకుండా కాలయాపన చేస్తోంది. కొల్లేరు నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు సైతం అదిగో.. ఇదిగో అనడం మినహా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యారనే విమర్శలు విన్పిస్తున్నాయి.