May 28,2023 22:27

యథేచ్ఛగా చెరువుల తవ్వకాలకు యత్నం
చోద్యం చూస్తున్న అటవీశాఖ అధికారులు
కొల్లేరులోకి ప్రవేశించిన పొక్లెయిన్లను సీజ్‌ చేయడంలో నిర్లక్ష్యం
ప్రజాశక్తి - మండవల్లి

కొల్లేరుపై బడాబాబుల కన్ను పడింది. అవకాశం దొరికితే చెరువులు తవ్వేందుకు వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో కొందరు అక్రమార్కులు చెరువులు తవ్వేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. యథేచ్ఛగా కొల్లేరులోకి పొక్లెయిన్లతో వెళ్లి చెరువులు తవ్వేందుకు ఈనెల 27వ తేదీన వెళ్లారు. అయితే అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు తూతూమంత్రంగా అడ్డుకున్నారు. అభయారణ్యంలోకి పొక్లెయిన్లు ప్రవేశించి గట్లు వేసినప్పటికీ కనీసం సీజ్‌ చెయ్యకపోవడంపై అటవీశాఖ అధికారుల తీరుపై పలుఅనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా కొల్లేరులోకి జెసిబిలు, పొక్లెయిన్లు ప్రవేశించి అక్రమంగా చెరువులు తవ్వేందుకు ప్రయత్నిస్తే వాటిని సీజ్‌ చేసి సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటిదేమీ చేయకపోవడం గమనార్హం. అటవీశాఖ అధికారుల తీరు వెనుక లక్షలాది రూపాయలు చేతులు మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మణుగులూరు కొల్లేరు అభయారణ్యంలో సుమారు 400 ఎకరాల్లో చెరువులు తవ్వేందుకు ఓ బడాబాబు రాజకీయ నాయకుల అండదండలతో రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈ తవ్వకాలను అడ్డుకోకుండా సంబంధిత అధికారులకు ముందుగానే తాయిలాలు ముట్టచెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో పదుల సంఖ్యలో భారీ పొక్లెయిన్లను దింపి కొల్లేరు అభయారణ్యంలో మూడు తూముల వద్ద ఉన్న వడ్డీకోడు దగ్గర నుండి చెరువు తవ్వకాలు ప్రారంభించి గట్లు వేయడం ప్రారంభించాడు. అయితే ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖ సెక్షన్‌ అధికారి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పనులను నిలుపుదల చేశారు. అయితే అటవీ శాఖ అధికారులు ఏం చెప్పారో ఏమో తెలియదు గానీ పొక్లెయిన్లను సీజ్‌ చేయకుండా అభయారణ్యం నుండి చాకచక్యంగా తప్పించారు.
అంతేకాక ఈ చెరువుల తవ్వకానికి యత్నించిన కోనపురాజు రంగరాజు తన అనుచరులు కలిసి తవ్వకాలను అడ్డుకున్న అభయారణ్యంలో విధులు నిర్వహిస్తున్న తమపై దౌర్జన్యానికి దిగి అడ్డగించి, విధులకు ఆటకం కలిగించి దుర్భాషలాడారని మండవల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం కొసమెరుపు. ఇదిలా ఉంటే కొల్లేరు ఆపరేషన్‌ అనంతరం చిత్తడి నేలలను పరిరక్షించే బాధ్యతను అటవీశాఖకు అప్పగించారు. తిరిగి ఆక్రమణలకు గురికాకుండా కొల్లేరులోకి అనుమతిని నిషేధిస్తూ కఠిన ఆంక్షలు విధించారు. అయినప్పటికీ కొల్లేరు అభయారణ్యంలోకి పదుల సంఖ్యలో పొక్లెయిన్లు ఎలా వెళ్లాయి అనే ప్రశ్నలు సర్వత్రా తలెత్తుతున్నాయి. దీంతో అటవీ శాఖ అధికారుల తీరుపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. పదుల సంఖ్యలో పొక్లెయిన్లు కొల్లేరులోకి వెళ్లినప్పటికీ కేవలం ఆరు ప్రొక్లెయిన్లను మాత్రమే రిపోర్టులో చేర్చడం వాటిని కూడా సీజ్‌ చేయకపోవడం, ప్రాణ రక్షణ కల్పించాలని రిపోర్టులో కోరడం ఆ అనుమానాలకు మరింత బలం చేకూరుతుంది. తొమ్మిదేళ్ల క్రితమే ఇదే ప్రాంతంలో చెరువు తవ్వేందుకు విఫలయత్నం సాగింది. సుమారు 40 యంత్రాలతో కొల్లేరు అభయారణ్యంలో కొంతమేర గట్లు వేశారు. అయితే అప్పటి అటవీ శాఖ అధికారుల్లో నెలకొన్న నిర్లక్ష్యం వల్ల ఆ గట్లను ధ్వంసం చేయకపోవడంతో ఆ గట్టును ఆధారం చేసుకుని అంచలంచలుగా చెరువు పూర్తి చేసే చర్యలు నేటికీ సాగుతూనే ఉన్నాయి. దీంతో చెరువు పూర్తి చేసి కొల్లేరును ఆక్రమించాలనే ఆ వ్యక్తి తపన ఏ స్థాయిలో ఉందనేది స్పష్టమవుతుంది. ఈ క్రమంలోనే అధికారులు కూడా కాసుల మోజుతో విధుల్లో ఎంత నిర్లక్ష్యంగా నిర్వహిస్తున్నారనేది తేటతెల్లమవుతుంది. అయితే ముడుపులు, రాజకీయ ముసుగు బడాబాబు చెరువు తవ్వుకునేలా సహకరిస్తాయా? కొల్లేరు అభయారణ్యాన్ని పరిరక్షించడానికి ఉద్యోగాలు చేస్తున్నామని గుర్తెరిగి పరిరక్షిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సి ఉంది.
దీనిపై అటవీశాఖ సెక్షన్‌ అధికారి రామ్మోహన్‌సింగ్‌ని వివరణ కోరగా ఆయన తీవ్రనిర్ల్యంగా సమాధానం చెప్పారు. కొల్లేరులో నిబంధనలు, చట్టాలు ఏమీ లేవని, తమరు కూడా మాట్లాడొద్దంటూ చొప్పుకొచ్చారు. అంతేకాక పత్రికలో రాయకూడని పదజాలంతో మాట్లాడటంపై ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థమవుతుంది. ఒక బాధ్యతగల ఉద్యోగి తీరు ఇలా ఉండటంపై ఆయనను ఎవరు? ఏ స్థాయిలో మభ్యపెట్టారోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు, కొల్లేరువాసులు కోరుతున్నారు.