Apr 17,2023 21:32

లంక గ్రామాల్లో తాగేందుకు గుక్కెడు నీళ్లు కరువు
కొనుగోలు చేస్తేనే గొంతు తడిచేది
తాగునీటి పథకాల ఏర్పాటులో తాత్సారం
విచ్చలవిడిగా ఆక్వా చెరువుల తవ్వకాలు
తాగునీటి చెరువులకు మాత్రం అనుమతులు నిల్‌
వేసవిలో పరిస్థితి మరీ దారుణం
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

కొల్లేరు గ్రామాల ప్రజలు గుక్కెడు నీళ్ల కోసం అల్లాడిపోతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఏళ్ల తరబడి తాగునీటి కోసం కొల్లేరు ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఆక్వా చెరువుల తవ్వకాలతో తాగునీటి కోసం కొల్లేరు ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కొల్లేరు గ్రామాలకు తాగునీటి పథకాలు మంజూరు చేస్తున్నట్లు కాగితాల్లో చూపించడం తప్ప వాటిని అమల్లోకి తెచ్చే పరిస్థితి లేకుండాపోయింది. ఏలూరు జిల్లాలో ఉంగుటూరు, దెందులూరు, కైకలూరు నియోజకవర్గాలు కొల్లేరును ఆనుకుని ఉన్నాయి. కొల్లేరులో దాదాపు 130కిపైగా లంకగ్రామాలు ఉన్నాయి. ఐదు లక్షలకుపైగా జనాభా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. లక్షల జనాభాకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోని పరిస్థితి నెలకొంది. దీంతో కొల్లేరు గ్రామాల ప్రజల తాగునీటి ఇబ్బందులు తారాస్థాయికి చేరాయి. గడగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు ఎంఎల్‌ఎలను నిలదీస్తున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇటీవల జరిగిన డిఆర్‌సి సమావేశంలో కొల్లేరు గ్రామాల్లో తాగునీటి సమస్యపై ఎంఎల్‌ఎలు పుప్పాల వాసుబాబు, దూలం నాగేశ్వరరావు, ఎంఎల్‌సి జయమంగళ వెంకటరమణ ఏకరువుపెట్టారు. ఆగడాలలంకలో రూ.29 కోట్లతో తాగునీటి స్కీము ప్రకటించినా ఇప్పటికీ ఒక్క అడుగూ ముందుకు పడలేదు. మరో గ్రామంలో రూ.నాలుగు కోట్లతో తాగునీటి పథకం ప్రకటించినా అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా తయారైంది. దీంతో ప్రజలు దూరప్రాంతాలకు వెళ్లి తాగునీరు కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. కొన్ని గ్రామాల్లో స్నానం చేయడానికీ నీళ్లు పనికిరావడం లేదని ప్రజాప్రతినిధులే చెబుతున్న పరిస్థితి ఉంది. దీన్నిబట్టి కొల్లేరులో తాగునీటి సమస్య ఏవిధంగా ఉందో వేరే చెప్పనక్కర్లేదు.
ఆక్వా చెరువులు తవ్వేస్తారు.. తాగునీటి చెరువులకు అనుమతి లేదంట..!
కొల్లేరు ప్రజల తాగునీటి సమస్యపై ప్రతియేటా వేసవికి ముందు చర్చించడం తర్వాత మరిచిపోవడం షరా మాములు అన్నట్లు తయారైంది. సమావేశాల్లో అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ చెప్పడం, తర్వాత పనులు మాత్రం ముందుకు సాగకపోవడం సర్వసాధారణమైంది. ఆక్వా చెరువుల కారణంగా తాగునీటి వనరులన్నీ కలుషితమైపోవడంతో కొల్లేరు ప్రజల దాహం కేకలు రోజురోజుకీ మిన్నంటుతున్నాయి. కొల్లేరు గ్రామాల్లో ప్రస్తుతమున్న తాగునీటి చెరువులు జనాభాకు సరిపడా లేకుండాపోయాయి. ప్రస్తుతం ఉన్న చెరువుకు ఆనుకుని మరో చెరువు తవ్వుకునేందుకు భూమి కొరత లేదు. అయితే చెరువు తవ్వుకునేందుకు ఫారెస్టు అధికారుల అనుమతి అవసరం. ప్రతియేటా దీనిపై చర్చ సాగుతున్నా ఇప్పటి వరకూ అనుమతులు మాత్రం రాలేదు. కొల్లేరులో అనుమతి లేకుండా ప్రతియేటా వందల, వేల ఎకరాల్లో చేపల చెరువుల తవ్వకాలు సాగిపోతున్నాయి. ప్రజలకు అవసరమయ్యే తాగునీటి చెరువుల తవ్వకాలకు మాత్రం అనుమతులు లేవంటూ కాలయాపన చేస్తున్నారు. కొల్లేరులో తాగునీటి సమస్య పరిష్కారానికి అధికారులు సరైన ప్రణాళికలు తయారు చేయడంలో విఫలమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. ప్రభుత్వం పట్టించుకోకపోవడం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాగునీటి చెరువులు కొత్తవి పూర్తయ్యేసరికి సమయం పడుతోంది. ప్రస్తుత వేసవిలో కొల్లేరు ప్రజల దాహర్తి తీర్చేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. కొల్లేరులో కొత్త తాగునీటి చెరువుల తవ్వకాలు ఆర్‌డిఒ, తహశీల్దార్‌ పర్యవేక్షణ పూర్తి చేస్తామని ఇటీవల నిర్వహించిన డిఆర్‌సి సమావేశంలో ఇన్‌ఛార్జి మంత్రి పినిపే విశ్వరూప్‌ తెలిపారు. ఈ వేసవిలోనైనా మాట నిలబెట్టుకుంటారో లేదో వేచిచూడాలి.