సంప్రదాయ చేపల వేటకు చర్యలు
కొల్లేరు కాలుష్యాన్ని అరికడతాం
ఆరు నెలల్లో తాగునీటి సమస్యకు పరిష్కారం
కైకలూరు ఎంఎల్ఎకు, ఆయన కొడుకుకు బుద్ది చెబుతాం
అదేపోలీసులతో సమాధానం చెబుతాం
ముదినేపల్లి సభలో పవన్‌కల్యాణ్
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి/ముదినేపల్లి
'కొల్లేరులోని 52 మత్స్యకార సంఘాలను వైసిపి నిర్వీర్యం చేసింది.. రోడ్లు గానీ, తాగునీటి సమస్యగానీ పరిష్కరించకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. టిడిపి, జనసేన కూటమి అధికారంలోకొచ్చాక కొల్లేరు ప్రజలకు అండగా ఉంటాం. సంప్రదాయ చేపల వేటకు అవసరైన చర్యలు చేపడతాం. మత్స్యకార సంఘాలకు అండగా ఉంటాం' అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తెలిపారు. వారాహి యాత్రలో భాగంగా శుక్రవారం పవన్ ఏలూరు జిల్లాలోని ముదినేపల్లిలో పర్యటించారు. ముందుగా మచిలీపట్నం నుంచి బయలుదేరి ఆయన పెడన, బంటుమిల్లి మీదుగా ముదినేపల్లి చేరుకున్నారు. దారిపొడవునా పవన్‌కల్యాణ్‌కు ఘనస్వాగతం లభించింది. సాయంత్రం ముదినేపల్లిలో జరిగిన బహిరంగసభలో పవన్ మాట్లాడారు. ఒకపక్క 175 సీట్లు వస్తాయంటూ చెబుతున్న వైసిపి జనసేనను చూసి భయపడుతుందన్నారు. తాము ఎన్డిఎలో ఉంటే వారికేంటి లేకపోతే ఏంటి అని ప్రశ్నించారు. మరో ఐదునెలల్లో తేలుస్తామన్నారు. తెలంగాణ ఎన్నికలతో వెళ్లినా తామేంటో తేలుస్తామని చెప్పారు. 2009లో వైఎస్.రాజశేఖర్‌రెడ్డిని ఎదుర్కొని నిలబడ్డానని, తమకు భయపడేవాళ్లం కాదన్నారు. 2014లో టిడిపి, బిజెపికి మద్దతిచ్చామని తెలిపారు. కైకలూరులో జనసైనికులను ఇబ్బంది పెడుతున్నారని, ఎస్సి, ఎస్టి కేసులు సైతం పెడుతున్నారని, వాటికి తగిన సమాధానం చెబుతామన్నారు. రూ.14 కోట్లతో పెద్దింట్లమ్మ గుడికి వంతెన నిర్మించలేకపోయారని వైసిపిని విమర్శించారు. కైకలూరు ఎంఎల్ఎ, ఆయన కొడుకు దౌర్జన్యాలు చూస్తు ఊరుకోబోమని, భవిష్యత్తులో దెబ్బకు దెబ్బ చూపిస్తామన్నారు. పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్లు చేస్తున్నారన్నారు. అదే పోలీసులతో మక్కెలు విరగకొట్టి స్తామన్నారు. కొల్లేరు ప్రజలకు టిడిపి, జనసేన కూటమి న్యాయం చేస్తుందన్నారు. రోడ్లు వేయరు, బ్రిడ్జిలు కట్టరు గానీ, ప్రశ్నించిన వారిపై కేసులు మాత్రం పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకొచ్చాక కొల్లేరు పరిధి మొత్తం ప్రజలకు చూపిస్తామన్నారు. కలిదిండిలో రోడ్డు వేయలేదని, వినాయక చవితి లడ్డూ పాట సొమ్ముతో రోడ్డు వేసుకుంటామంటే ఎంఎల్ఎ అడ్డుపడటం సిగ్గుచేటన్నారు. ముదినేపల్లి మండలంలో ఆరువేల మందికి తాగడానికి నీళ్లులేవని వినితి ఇచ్చారన్నారు. వాటర్‌ప్లాంట్‌లో శుద్దిచేసే వ్యవస్థ లేదని, కిడ్నీలు దెబ్బతింటున్నాయని జనం చెబుతున్నారన్నారు. టిడిపి, జనసేన కూటమి వచ్చిన ఆరునెలల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. పంచాయతీ నిధులను కాజేస్తే పనులు ఏ విధంగా చేస్తారని ప్రశ్నించారు. ఉదయం పథకం కింద డబ్బులు.. సాయంత్రం మద్యం పేరుతో దోపిడీ ఇదే రాష్ట్రంలో జరుగుతుందన్నారు. ఆడపడుచులు కోరుకుంటే ఆయా గ్రామాల్లో మద్యం నిషేధిస్తామన్నారు. అధికారంలోకొచ్చిన నెలరోజుల్లో మద్యం ధరలు తగ్గించి పాతధరలు అమలుచేస్తామన్నారు. కొల్లేరు కాంటూరు లెక్కలు జగన్‌కు తెలియవన్నారు. కొల్లేరులోకి 567 డ్రెయిన్ల నుంచి 17 వేల టన్నుల కాలుష్యం కలుస్తుందన్నారు. కాలుష్యాన్ని శుద్ధి చేసే కార్యక్రమాలు చేపడతా మన్నారు. కైకలూరును నగరపంచాయతీ చేయలేక పోయారని, తాము అధికారంలోకొచ్చాక మినీపట్టణంగా మారుస్తామన్నారు. ఆక్వా రైతులకు అండగా ఉంటామన్నారు. 2021లోనే ఓట్లు చీలని వ్వనని చెప్పాననని, అదేమాటకు కట్టుబడి ముందుకు సాగుతు న్నామన్నారు. సంక్షేమ పథకాలు ఆపేస్తారని వైసిపి ప్రచారంలో నిజం లేదన్నారు. టిడిపి, జనసేన నాయ కులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. దశాబ్ద కాలం పాటు కలిసిమెలిసి పనిచేయాల్సి ఉంటుం దన్నారు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా అడుగులు వేస్తున్నా మన్నారు. జగన్‌ను ఇంటికి పంపించే సమయం అసన్నమైందని, హలో ఎపి.. బైబై జగన్ అంటూ తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో జనసేన, టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.










