
ప్రజాశక్తి-తెనాలి : గ్రామంలో ఉన్న చెరువు ప్రజలను కష్టాల ఊబిలోకి నెడుతోంది. చెరువు నిండితే నీరు బయలకు పోయే మార్గంలేదు. గతంలో ఉన్న తూములు మూసుకు పోయాయి. దీంతో వర్షం పడితే చెరువు నీటితో చుట్టుపక్కల ఉన్న వీధులన్నీ జలమయమౌతున్నాయి. పేరుకు సిమెంట్ రోడ్లే అయినా వర్షంపడితే చెరువునీటితో పాటు మురుగునీరు ఏకమై ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రూరల్ గ్రామం కొలకలూరులో ఉన్న వీరమ్మ చెరువు దుస్థితికి చెందిన వివరాలిలా ఉన్నాయి.
తెనాలి నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగి, మేజరు గ్రామ పంచాయతీగా ఉన్న కొలకలూరులో ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రజల సమస్యలను పట్టించుకునే తీరిక పంచాయతీ సిబ్బందికీలేదు. శాసనసభ్యులకు అంతకంటే పట్టదు. దీంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గ్రామంలోని గంగానమ్మపేట గుడి ఎదురుగా ఉన్న వీరమ్మ చెరువు గుర్రపుడెక్క, తూటికాడతో పూడుకు పోయింది. గతంలో చెరువు నిండితే నీరు బయటకు పోయేందుకు తూములుండేవి. ఆ తూముల ద్వారా నీరు పంటకాలువలకు చేరేది. అయితే ప్రస్తుతం ఆ తూములు పూడుపుకోయాయి. ఆలాగే తూములున్న కల్వర్టు కూడా కుంగిపోయింది. పైగా ఈ నీరు పారే పంట కాలువకు కూడా స్థానికులు కొన్ని చోట్ల అడ్డంకులు సృష్టించారు. దీంతో వర్షం పడితే చెరువు నిండి నీరు రోడ్లపైకి చేరుతుంది. పైగా ఈ ప్రాంతంలో సైడు కాలువలు లేవు. చెరువు నిండిన సమయంలో ఆ నీటితో పాటు మురుగు కూడా ఏకమై ఇళ్ళలోకి చేరుతుంది. చెరువులో ఉండే పాములు, కప్పలు, ఇతర జలచరాలు ఇళ్ళలోకి చేరుతున్నాయి. ఇదిలా ఉంటే సైడు కాలువలు కూడా లేకపోవటంతో నీరు రోడ్డుపైనే నిలిచిపోతున్నాయి. కోనేటిపురం సెంటర్ నుంచి గంగానమ్మపేటకు వెళ్లే రోడ్డు, అంకమ్మ తల్లి గుడి పక్క రోడ్డు, ఆర్‌జె కళాశాల రోడ్లపై నీరు నిలిచిపోతున్నాయి. సిమెంట్ రోడ్లు ఉండి కూడా ఉపయోగంలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెరువు, డ్రెయినేజ్ సమస్యపై పంచాయతీకి పిర్యాదు చేసినా పట్టించుకునే తీరిక లేదని స్థానికులు వాపోతున్నారు.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేకు ఫిర్యాదు
ఇటీవల గ్రామంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఇంటింటికీ తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈసందర్బంగా కోనేటిపురం, గంగానమ్మపేట స్థానికులు చెరువు సమస్యతో పాటు, సైడు డ్రెయిన్ల నిర్మాణంపై ఎమ్మెల్యేకు వివరించారు. సమస్య తీవ్రతపై ఏకరువు పెట్టారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామన్న ఎమ్మెల్యే నుంచి ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదని స్థానికులు వాపోతున్నారు. గ్రామ పంచాయతీతో పాటు ఎమ్మెల్యే కూడా సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని వారు కోరుతున్నారు.