ప్రజాశక్తి-తెనాలి : ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు అంబటి రాయుడు శుక్రవారం మండలంలోని కొలకలూరులో పర్యటించారు. ఇటీవల క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన ఆయన పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలుత గ్రామంలోని శివాలయాన్ని సందర్శించారు. అనంతరం ఖాజీపేటలోని రైతు భరోసా కేంద్రానికి వెళ్లి అక్కడ రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసు కున్నారు. అదే ప్రాంతంలో చేతివృత్తిదారులైన శాలివాహ నులను కలిసి వారి జీవన విధానాన్ని తెలుసుకున్నారు. వృత్తి పరంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. మధ్యాహ్నం జెడ్‌పి పాఠశాలకు వచ్చిన ఆయన విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వపరంగా విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, దానిపై వారి స్పందనను తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి పాఠశాల్లోనే మధ్యాహ్న భోజనం చేశారు. ఆయనతో ఫొటోలు దిగేందుకు విద్యార్థులు, క్రికెట్ అభిమానులు, స్థానికులు పోటీపడ్డారు.










