Jan 28,2023 23:57

ఆవేదన వ్యక్తం చేస్తున్న కుటుంబీకులు (ఇన్‌సెట్‌లో సుబ్రహ్మణ్యం)

ప్రజాశక్తి-కొత్తకోట:ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు నెల రోజులుగా కానరాక పోవడంతో ఆ కుటుంబం దిక్కు తోచని స్థితిలో ఉంది. పది రోజుల పాటు క్లినర్‌గా వెళ్లి సంపాదించుకు వస్తానని చెప్పి వెళ్లిన కొడుకు వెస్ట్‌ బెంగాల్‌ రాష్ట్రం కోల్‌కత్తాలో ఆచూకీ కనబడకుండా పోవడంతో ఆ వృద్ధ తల్లిదండ్రులు, అతని భార్య, పిల్లలు తల్లడిల్లుతున్న సంఘటన రావికమతం మండలం కొత్తకోటలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనకు సంబంధించి కుటుంబ సభ్యలు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రాయి సుబ్రహ్మణ్యం (30) గ్రామంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సొంత ఇల్లు కుడా లేని సుబ్రహ్మణ్యం కుటుంబంలో సరిగా కళ్ళు కనపడని తండ్రి రాయి రమణ (66), కాలు సక్రమంగా లేని వృద్దురాలైన తల్లి రాజుతో పాటు భార్య కళ్యాణి, మరో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఇదే గ్రామానికి చెందిన ఐసర్‌ వేన్‌ యజమాని గట్టా శ్రీనుతో కలిసి డిసెంబర్‌ 29న క్లినర్‌గా పని చేసేందుకు ఒప్పందం పై వెళ్ళాడు. యానాంలో గాజువాక ఏరియా గంట్యాడకు చెందిన శంకర్‌ అనే మరో వేన్‌ యజమానితో కలిసి రెండు వాహనాలతో యానాం నుంచి అసోమ్‌ రాష్ట్రానికి పైపులు లోడ్‌తో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కోల్‌కత్తాలో రిటన్‌ లోడ్‌ కోసం జనవరి 7,8 తేదీల్లో ఆగారు. లోడ్‌ తొందరగా దొరక పోవడంతో అక్కడే ఉన్నారు. ఈ ముగ్గురులో సుబ్రహ్మణ్యం 8న రాత్రి ఆకస్మికంగా అదృశ్యం అయ్యాడు. అప్పటి వరకూ శ్రీను, శంకర్‌లతో కలిలసి ఉన్న సుబ్రహ్మణ్యం అదృశ్యం కావడంతో రెండు రోజులు పాటు వెతికారు. ఆచూకీ లేక పోవడంతో వెనుతిరిగారు. వెంటనే సమాచారం ఇవ్వకుండా సుబ్రహ్మణ్యం కనపడలేదని యువకుని కుటుంబ సభ్యలకు జనవరి 16న చెప్పారు. దీంతో కలత చెందిన తల్లిదండ్రులు, భార్య కళ్యాణి కొత్తకోట పోలీసులను ఆశ్రయించి జనవరి 17న ఫిర్యాదు చేశారు. దీనిపై కొత్తకోట ఎస్‌ఐ విభూషణరావు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. డ్రైవర్‌ శ్రీనును మరో మారు కోల్‌ కతాలో ఆచూకీ తెలుసు కోవాలని పంపారు.తమ కుమారుడు సుబ్రహ్మణ్యంను పనికి వెంట తీసుకు వెళ్లిన శ్రీను నిర్లక్ష్యం గాను, పొంతన లేని సమాధానం చెబుతున్నాడని తల్లిదండ్రులు, భార్య కళ్యాణి ఆరోపిస్తూన్నారు. ఈ నెల 8 న అదృశ్యం అయితే 16న సమాచారం ఇచ్చాడని దీని వెనక ఏదో అనుమానం ఉందన్నారు. తన దగ్గర నుంచి కాకుండా మరో డ్రైవర్‌ శంకర్‌ వద్ద నుంచి అదృశ్యం అయినట్టు చెబుతున్నాడని తనతో వెళ్లిన యువకుడు అదృశ్యం అయితే తనకు సంబంధం లేదని చెప్పడంతో కుటుంబ సభ్యలు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసు శాఖ, ప్రభుత్వం చొరవ తీసుకుని తమ కుమారుడి ఆచూకీ తెలుసు కోవాలని కోరుతున్నారు.