Sep 26,2023 22:31

ఆర్‌డిఒ కార్యాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా
ప్రజాశక్తి - నరసాపురం టౌన్‌

           కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర వెయ్యి కాయలకు రూ.15 వేలు ఇవ్వాలని, కొబ్బరి రైతాంగ సమస్యలు పరిష్కరించాలని రైతు సంఘం ఆధ్వర్యంలో ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల హరేరామ్‌ మాట్లాడుతూ ఎకరం కొబ్బరి తోటకు రూ.40 వేల వరకు పెట్టుబడి అవుతుందని, ఒకప్పుడు నెలకు ఒక దింపు దిగడంతో ఆదాయం బాగుండేదని, రాను రాను మూడు నెలలకు దింపు దిగడంతో ఎకరంలో ఉన్న 70 చెట్లకు వెయ్యి కాయలకు మించి దిగుబడి రావటం లేదన్నారు. వెయ్యి కాయలకు రూ.మూడు వేలు మాత్రమే ఆదాయం వస్తుందని, సంవత్సరానికి రూ.12 వేలు మాత్రమే రావడంతో కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల కొబ్బరి రైతులు తీవ్ర సంక్షోభంలో పడ్డారన్నారు. జిల్లాలో నాఫెడ్‌, ఆయిల్‌ ఫెడ్‌ ద్వారా కొబ్బరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. విదేశీ కొబ్బరి ఉత్పత్తుల దిగుమతులు ఆపాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో కొబ్బరి ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలని కోరారు. తొలుత స్థానిక మీరా స్మారక గ్రంథాలయంలో కొబ్బరి రైతుల సదస్సు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జుత్తిగ నరసింహమూర్తి అధ్యక్షతన నిర్వహించారు. నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. జిల్లా కన్వీనర్‌గా తూటే మార్టిన్‌ లూథర్‌, కో-కన్వీనర్‌గా కడలి నాగరాజు, మరో 13 మంది కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో గుత్తుల శ్రీరామచంద్రుడు, కొప్పుశెట్టి సత్యనారాయణ, కుంచే రామచంద్రరావు, అయినంపూడి బాబూరావు, దొంగ భాస్కరరావు, మైలా జనార్దన్‌రావు, కడలి నాగరాజు, మల్లుల శ్రీరాములు, కె.నాగరాజు, మైగాపుల త్రిమూర్తులు, దొంగ భాస్కరరావు, పిల్లి కామేశ్వరరావు పాల్గొన్నారు.