
తీవ్ర ఇబ్బందుల్లో కొబ్బరి రైతులు
రెండు జిల్లాల్లో 50 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు
కొనుగోలు కేంద్రాలు లేక దక్కని గిట్టుబాటు ధర
పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
జిల్లాలో కొబ్బరి సాగు చేసే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పండించిన పంటను కొనేవారు లేక, గిట్టుబాటు ధర దక్కక దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. కొబ్బరిపై కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతులను కోలుకోలేకుండా చేస్తున్నాయి. రెండు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో కొబ్బరి సాగవుతున్నా ఆ రైతుల గురించి ప్రజాప్రతినిధులుగాని, అధికారులుగాని పట్టించుకున్న దాఖలాల్లేవు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ కొబ్బరి రైతులు రోడ్డెక్కేందుకు సిద్ధమయ్యారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించకపోతే కొబ్బరి రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోనున్నారు.
కొబ్బరి సాగులో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. విభజిత ఏలూరు జిల్లాలో 35 వేల ఎకరాల్లో, పశ్చిమగోదావరి జిల్లాలో 15 వేల ఎకరాల్లో మొత్తంగా రెండు జిల్లాల్లో 50 వేల ఎకరాల్లో రైతులు కొబ్బరి సాగు చేస్తున్నారు. రైతులు ప్రతియేటా పెద్దఎత్తున కొబ్బరి పండిస్తునప్పటికీ అధికారులుగాని, ప్రజాప్రతినిధులుగాని కొబ్బరి రైతుల గురించి పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం రైతుకు కొబ్బరికాయకు దక్కే ధర రూ.ఏడు మాత్రమే. మార్కెట్లో మాత్రం రూ.15కు పైగా అమ్ముతున్నారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కకపోగా కొనుగోలుదారునికి కూడా ఉపశమనం లేకుండాపోయింది. దళారులే రాజ్యమేలుతున్న పరిస్థితి ఏర్పడింది. ఎకరా కొబ్బరి సాగులో దాదాపు 50 నుంచి 55 చెట్లు ఉంటాయి. గతంలో చెట్టు కాయలు తీసుకునేందుకు ఏడాదికి రూ.1200 వరకూ చెల్లించేవారు. ఇప్పుడు దళారులంతా కుమ్మక్కై చెట్టుకు రూ.600 మాత్రమే ఇస్తామని చెబుతున్న పరిస్థితి ఉంది. ఖర్చులు తక్కువగా ఉన్నప్పుడు ధర ఉండేది. ఖర్చులు పెరిగిన తర్వాత ధర తగ్గిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. ఎకరా కొబ్బరి సాగుకు రూ.40 వేలకు పైగా పెట్టుబడి అవుతోంది. కాయలు తీసి గుట్టగా వేయడానికి కాయకు దాదాపు రూ.మూడు ఖర్చవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాయ ధర రూ.15 ఇస్తే తప్ప రైతులకు గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేకుండాపోయింది.1992లో కాయ ధర రూ.ఐదు పలికితే సుమారు 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు కాయకు రూ.ఏడు ఇస్తే ఏవిధంగా గిట్టుబాటు అవుతుందో ప్రభుత్వం చెప్పాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. అయితే కొబ్బరి రైతులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొబ్బరికి గత కొన్నేళ్లుగా తెల్లదోమ, ఎర్రమల్లి వంటి తెగుళ్లు సోకుతున్నాయి. వీటి నివారణకు ఏం చర్యలు తీసుకోవాలో రైతులకు చెప్పే నాథుడే లేకుండాపోయాడు. జిల్లాలో ఇంత పెద్దఎత్తున కొబ్బరి సాగు సాగుతున్నా కొనుగోలు కేంద్రాలు లేకపోవడం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కొబ్బరి రైతులకు న్యాయం చేయాలంటూ ఎపి రైతుసంఘం ఆధ్వర్యంలో సోమవారం చలో కలెక్టరేట్‌కు పిలుపు ఇవ్వడం ప్రస్తుత పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా కొబ్బరి రైతుకు అండగా నిలవాలని అంతా కోరుతున్నారు.
కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
బొబ్బా రమేష్, కొబ్బరి రైతు, ఆంజనేయ నగరం, భీమడోలు మండలం
ఎనిమిదెకరాల్లో కొబ్బరి సాగు చేస్తున్నాను. గతంలో చెట్టుకు రూ.1200 వచ్చేవి. ఇప్పుడు రూ.600కు అడుగుతున్నారు. పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతుంటే కొబ్బరి ధర తగ్గిపోతుంది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తేనే కొబ్బరి రైతులకు న్యాయం జరుగుతోంది. లేకపోతే కొబ్బరి సాగు నుంచి రైతుల తప్పుకునే పరిస్థితి రానుంది.
తెగుళ్లు సోకినా పరిష్కారం చెప్పే నాథుడే లేడు
పానుగంటి అచ్యుతరామయ్య, చొదిమెళ్ల
కొబ్బరి సాగును తెల్లదోమ, ఎర్రమల్లి వంటి తెగుళ్లు దెబ్బతీస్తున్నాయి. వీటి నివారణా చర్యలు గురించే చెప్పే నాథుడే లేకుండా పోయాడు. ప్రస్తుతం కొబ్బరి కాయ ధర రూ.ఏడు పలుకుతోంది. కాయ ధర రూ.15 లేకపోతే రైతుకు ఏమాత్రం గిట్టుబాటు కాదు. కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతోంది. కొబ్బరి రైతు గురించి ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడం ఆవేదన కల్గిస్తోంది.
కొబ్బరి రైతును దెబ్బతీస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలు
కె.శ్రీనివాస్, రైతుసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి
విదేశీ కొబ్బరి ఉత్పత్తుల దిగుమతులను కేంద్రం వెంటనే ఆపాలి. కొబ్బరి రైతుకు సరైన ధర కల్పించే విధంగా నాఫెడ్, ఆయిల్‌ఫెడ్‌ను రంగంలోకి దించాలి. కొబ్బరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా చూడాలి. ధరల స్థిరీకరణ పథకాన్ని కొబ్బరికి వర్తింపచేయాలి. కొబ్బరి రైతుల సమస్యను పరిష్కరించకపోతే రైతులతో కలిసి పెద్దఎత్తున ఆందోళన చేపడతాం.