Aug 16,2023 21:56

ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి

కన్వీనర్లతో ఎంఎల్‌ఎ సమావేశం
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని బ్రాహ్మణపల్లిలో మేకపాటి స్వగృహంలో నియోజకవర్గంలోని 93 సచివాలయ కన్వీనర్లతో ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి బుధవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఉన్న సమయంలో అటు వ్యవసాయ రంగంలో, ఇటు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందని, 2009లో ఆయన హఠాన్మరణం చెందడంతో పదేళ్ల పాటు రాష్ట్ర పరిస్థిత అగమ్యగోచరంగా మారిందన్నారు. 2019లో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారం స్వీకరించే సమయానికి రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఆయన రెండేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌ ను ఆదర్శంగా నిలిచేలా చేశారన్నారు.
వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ జీవన ప్రమాణాల పెంపు, చెప్పాడంటే కచ్చితంగా చేస్తాడనే భరోసా ప్రజలందరికి కల్పించి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిపారని, కరోనా వల్ల ప్రపంచమంతా అతలాకుతలమైన సమయంలో కూడా పేద ప్రజలకు ఎక్కడా తాను చేస్తానని అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిలుపుదల చేయకుండా పాలన కొనసాగించారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారన్నారు. నియోజకవర్గంలో సంక్షేమ పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.800 కోట్లు, అభివృద్ధి పనుల కింద రూ.200 కోట్లు నిధులు మంజూరు చేశారని, నియోజకవర్గానికి రూ.1000 కోట్లు నిధులు మంజూరు చేశారన్నారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని కలిపి రూ.150 కోట్లు మంజూరు కాలేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంక్షేమ పాలనను సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు ప్రజలందరిలోకి మరింతగా తీసుకెళ్లి రానున్న 2024 ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించే విధంగా కృషి చేద్దామని తెలిపారు. నియోజకవర్గ పరిశీలకులు సింగసాని గురుమోహన్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తాను ఇచ్చిన మాట ప్రకారం సచివాలయ కన్వీనర్లు, గృహసారథుల కోసం పార్టీ సొంత నిధులను వెచ్చించి బీమా సౌకర్యం కల్పిస్తున్నారని, సచివాలయ కన్వీనర్లు బీమాను దరఖాస్తు చేసుకునే విధానాన్ని వివరించి సచివాలయ కన్వీనర్లు గృహసారథులకు తప్పక బీమా సౌకర్యం కల్పించేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.